తోడేస్తున్నారు!
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:41 AM
మట్టే కదా? ఏం చేసుకుంటారని అనుకోవచ్చు. అలా అనుకుంటే పొరపాటే మరి. ఆ మట్టితో కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతోంది.
పరిగిలో యథేచ్ఛగా మట్టిదందా!
అనుమతి గోరంత.. తవ్వకాలు కొండంత
కరుగుతున్న గుట్టలు, కొండలు
రాత్రింబవళ్లు యథేచ్ఛగా సాగుతున్న రవాణా
అక్రమ వ్యాపారులకు అధికారుల వత్తాసు
అధికార పార్టీ నేతల అండదండలు సైతం
అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో తవ్వుకున్నోళ్లకు తవ్వుకన్నంత మట్టి అన్న చందంగా సాగుతోంది అక్రమ వ్యాపారం. గోరంతకు అనుమతులు తీసుకొని కొండంత కొల్లగొడుతు న్నారు. దీంతో గుట్టలు, కొండలు మాయం అవుతున్నాయి. రాత్రింబవళ్లు యథేచ్ఛగా రవాణా సాగిస్తూ రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పరిగి ప్రాంతంలో జరుగుతున్న ‘మట్టిదందా’పై కథనం.
పరిగి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మట్టే కదా? ఏం చేసుకుంటారని అనుకోవచ్చు. అలా అనుకుంటే పొరపాటే మరి. ఆ మట్టితో కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతోంది. పరిగి మండలంలో అక్రమంగా రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపి సొరంగాలుగా మారుస్తున్నారు. భయంకరమైన లోతులో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాలు కూడా ప్రభుత్వ,ప్రైవేట్ భూముల్లో జరుపుతుండటం గమనార్హం. ఈ మట్టిని నిబంధనలకు విరుద్ధంగా లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే ఈ మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారం మాదే.. మమ్మల్ని అడ్డుకునేది ఎవరనే ధీమాతో వ్యాపారాన్ని సాగిస్తున్నారు పలువురు వ్యాపారులు. నామ్‌కేవాస్తే నాలుగైదు ఎకరాల అనుమతి పొంది వందల ఎకరకాల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రెవెన్యూ,పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు కుమ్ముక్కె మట్టి తరలింపును నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అధికారులంతా అధికార పార్టీ నేతల చేసే వ్యాపారానికి వత్తాసు పలుకున్నారు.
మెండుగా ఆదాయం
అసెన్డ్ భూముల్లో మట్టి తవ్వకాలు ఇక్కడి రెవెన్యూ అధికారులకు అక్రమ ఆదాయాన్ని సమకూరుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. పరిగి మండలం రంగాపూర్, నజీరాబాద్, రూఫ్‌ఖాన్‌పేగ్, ఇబ్రహీంపూర్, రంగంపల్లి, తుంకులగడ్డ, సుల్తాన్‌పూర్, జాఫర్‌పల్లి, సయ్యద్‌మల్కాపూర్, ఖుదావంద్‌పూర్, రాఘవాపూర్‌లలో అక్రమంగా మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. రెవెన్యూ అధికారుల కళ్లముందే ఈ తతంగం జరుగుతున్నా తమకేందుకులే అన్నట్లు వ్యహరిస్తుండటం గమనార్హం.
మాముళ్ల మత్తులో అధికారులు!
అసైన్‌మెంట్ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్న విషయాలను స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే అక్కడికి వెళ్లే రెవెన్యూ, పోలీస్ సిబ్బంది కొద్దిసేపు అక్కడ హడావుడి చేసి మట్టి వ్యాపారుల దగ్గర మామూళ్లు తీసుకొని అక్కడ ఉన్న జేసీబీ, ట్రాక్టర్‌లను అక్కడి నుంచి పంపించి వేసి సమాచారం ఇచ్చిన వారిక ిఫోన్ చేసి అక్కడ ఎవరూ లేరే? మీరు ఎప్పుడు చుశారు? అంటూ సమాచారం ఇచ్చిన వారినే ఎదురు ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా మట్టి తవ్వకందారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నేతలే అధికం!
ఈ మట్టిదందాలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. అధికార పార్టీ నాయకులైతే మమ్మల్ని ఎవరూ అడ్డుకుంటారనే ధీమాతో వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ మట్టి దందా పంచాయితీ పోలీసుల వద్దనే జరుగుతుందటే ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మట్టి దందా అధికార పార్టీ నాయకులే ఎక్కువగా నడిపిస్తున్నారు. మట్టి వ్యాపారులు ఇచ్చే డబ్బులతో అధికారులు కూడా చూసినడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారంలో ఒకరిపైఒకరు గిట్టని వారు అధికారులు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఆ తర్వాత తిరిగి సెటిల్‌మెంట్లు చేసుకుంటున్న పరిస్థితి. మట్టి దందా పంచాయితీలను ప్రభుత్వ అధికారులు దగ్గర ఉండి సెటిల్‌మెంట్లు చేస్తుండడం గమనార్హం.