Share News

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:20 AM

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటనలు వికారాబాద్‌, ఘట్‌కేసర్‌ పరిధిల్లో చోటుచేసుకున్నాయి.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వికారాబాద్‌, జూలై 2: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటనలు వికారాబాద్‌, ఘట్‌కేసర్‌ పరిధిల్లో చోటుచేసుకున్నాయి. బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన వికారాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్‌ సీఐ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రవల్లి గ్రామానికి చెందిన తరుణ్‌కుమార్‌(21) సోమవారం రాత్రి వికారాబాద్‌లో పని ముగించుకుని అతడి స్నేహితుడిని బైక్‌పై తన గ్రామంలో దింపాడు. అనంతరం స్వగ్రామానికి వెళుతుండగా బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తరుణ్‌కుమార్‌కు తీవ్రగాయాలు కాగా పులుమద్ది గ్రామస్తులు అతడి తండ్రి సొప్పరి సుదర్శన్‌కు సమాచారం అందించారు. వెంటనే తండ్రి వచ్చి చూడగా తరుణ్‌ అప్పటికే మృతిచెందాడు. తండ్రి సుదర్శన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు భారతీయ న్యాయ సంహిత నూతన చట్టం ప్రకారం వికారాబాద్‌లో మొదటిదని పోలీసులు తెలిపారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ, రాజీవ్‌గృహకల్పలో నివాసముంటున్న ఉండే షేక్‌ గౌస్‌ పాషా(28) అన్నోజీగూడలో ఎన్టీపీసీ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా ఉప్పల్‌ నుంచి వస్తున్న బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌస్‌పాషాకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని గౌస్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బైక్‌ నడుపుతున్న ఘట్‌కేసర్‌కు చెందిన పవన్‌కుమార్‌, సూర్యకుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం షేక్‌ గౌస్‌ పాషా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు..

రైలు పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వేపోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ మధ్య ఓ గుర్తుతెలియని వృద్ధుడు రైలు పట్టాలు దాటుతుండగా వరంగల్‌ వైపు నుంచి వస్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్దుడు రైలు ముందుబాగానికి చిక్కుకోగా ఐదు కిలోమీటర్ల మేర రైలు లాక్కొచ్చింది. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలును ఆపి వృద్ధుడి మృతదేహాన్ని బయటకు తీశారు. నీలంరంగు చొక్కా, ఆరేంజ్‌ రంగు లుంగీ, కుడిచేతికి కడెం ఉన్నట్లు రైల్వేపోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 03 , 2024 | 12:20 AM