Share News

కబళిస్తున్న కాలుష్యం

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:03 AM

మండల పరిధిలోని మంఖాల్‌ పారిశ్రామిక వాడ నుంచి విడుదలవుతున్న విష వాయువులు, రసాయన జలాలతో స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రమాదకర స్థాయిలో విడుదలవుతున్న కాలుష్యం పంట పొలాలను పాడు చేస్తున్నాయి.

కబళిస్తున్న కాలుష్యం
రోడ్డుపై ప్రవహిస్తున్న కాలుష్యపు నీరు

మంఖాల్‌ పారిశ్రామికవాడ నుంచి విషవాయువులు

మృత్యువాతపడుతున్న మూగజీవాలు

రోడ్లపై పారుతున్న రసాయన జలాలు

పట్టించుకోని సంబంధిత అధికారులు

మహేశ్వరం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మంఖాల్‌ పారిశ్రామిక వాడ నుంచి విడుదలవుతున్న విష వాయువులు, రసాయన జలాలతో స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రమాదకర స్థాయిలో విడుదలవుతున్న కాలుష్యం పంట పొలాలను పాడు చేస్తున్నాయి. మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మంఖాల్‌ పారిశ్రామిక వాడ 35 పరిశ్రమల వరకు ఉన్నాయి. వీటిల్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 5 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులతో పచ్చని పంటలు రంగుమారి ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు కలుషితమై బోరు బావుల నుంచి గోధుమ రంగు నీరు వస్తుంది. ఆ నీటిని దేనికీ ఉపయోగించలేని పరిస్థితి ఉంది. దీంతో మొహబ్బత్‌నగర్‌, తుమ్మలూరు, సిరిగిరిపురం, మహేశ్వరం, మంఖాల్‌, ఇమాంగూడ, శ్రీనగర్‌ గ్రామాల్లో పంటలు పాడవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు మంఖాల్‌ చెరువులోకి చేరి నీరంతా కలుషితమవుతుంది. దీంతో అందులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఆ నీటిని మూగ జీవాలు తాగలేకపోతున్నాయి. అంతే కాకుండా మహేశ్వరం వెళ్లే ప్రధాన రోడ్డు పక్క నుంచి పరిశ్రమల ద్వారా బయటకు వచ్చే మురుగు దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ దారి వెంట వెళ్లే ప్రయాణికులు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. అయితే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పరిశ్రమలు నిబంధనలు పాటించాలి

పరిశ్రమలు కాలుష్య నియంత్రణ బోర్డు నియమ నిబంధనలను తప్పక పాటించాలి. పరిశ్రమల ద్వారా వెలువడే వ్యర్థాలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.

- అలువాల రవికుమార్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు

Updated Date - Dec 03 , 2024 | 12:03 AM