Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:50 PM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు మర్పల్లి, మేడ్చల్‌ పరిధిలో చోటుచేసుకున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

మర్పల్లి/మేడ్చల్‌ టౌన్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు మర్పల్లి, మేడ్చల్‌ పరిధిలో చోటుచేసుకున్నారు. అడవిపందిని బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కోటమర్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కోటమర్పల్లికి చెందిన కావలి నాగేశ్‌(30), తుల్జరాం ఇద్దరు కలిసి ఆదివారం బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సొంత గ్రామానికి వెళ్తుండగా కోటమర్పల్లి శివారులో అడవిపంది అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డికి తరలించారు. చికిత్స పొందుతూ నాగేశ్‌ మృతిచెందగా తుల్జరాం చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ప్రమాదంలో బైక్‌ అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఓయువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మండలంలోని రాయిలాపూర్‌ నుంచి మధు(33) అనే యువకుడు శ్రీరంగవరం బైక్‌పై వెళ్తుండగా రాయిలాపూర్‌ శివార్లలో బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. తీవ్రగాయాలపాలైన మధు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టే లోపే ప్రాణాలు కోల్పోయాడు. కాగా క్రషర్ల నుంచి కంకర తరలించే లారీల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై కంకర పడటంతో బైక్‌జారి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుంటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.

చేపలవేటకు వెళ్లి యువకుడు..

ధారూరు: చేపల పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు చేపల కోసం వేసిన వలకు చిక్కుకుని నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మైలారం కొత్త తండాలో ఆదివారం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్త తండాకు చెందిన విక్రమ్‌(25) ఆదివారం ఉదయం చేపలు పట్టేందుకు సమీపంలోని చింతకుంట గచ్చుకత్వకు వెళ్తున్నట్లు తండ్రి సీతారాంకు చెప్పి వెళ్లాడు. చేపల కోసం గచ్చుకత్వలో వలలు వేస్తుండగా ఓవల విక్రమ్‌ కాళ్లకు చుట్టుకుంది. వలను తొలగించే ప్రయత్నంలో వల కాళ్లను చేట్టేయడంతో కత్వ నీటిలో మునిగి మృతిచెందాడు. విక్రమ్‌ ఇంటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన తండ్రి సీతారాంకత్వ వద్దకు వెళ్లి కత్వ నీటిలో ఉన్న వలలను బయటకు తీస్తుండగా వలతో పాటు కుమారుడు విక్రమ్‌ మృతదేహం కనిపించింది. స్థానికుల సాయంతో నీటిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

Updated Date - Dec 23 , 2024 | 11:50 PM