Share News

ఆలయాల సంరక్షణకు ఏకం కావాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:07 AM

ఆలయాలను కాపాడుకోవడానికి ప్రతీ హిందువు ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్‌, రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహరెడ్డిలు పిలుపునిచ్చారు.

ఆలయాల సంరక్షణకు ఏకం కావాలి
గట్టుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన అభిషేకంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

మహేశ్వరం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఆలయాలను కాపాడుకోవడానికి ప్రతీ హిందువు ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్‌, రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహరెడ్డిలు పిలుపునిచ్చారు. మండలంలోని గట్టుపల్లి వీరాంజనేయ స్వామి ఆలయం పక్కనున్న దర్గా వద్ద సోమవారం ఓ ముస్లిం వ్యక్తి మొక్కుబడి నిమిత్తంగా మేకను బలియ్యడాన్ని నిరసిస్తూ బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులు మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాల అపవిత్రతో పాటు వరుస దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించలేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కక్కుర్తి పడి ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడిపై దాడి మరవకముందే గట్టుపల్లి వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గా వద్ద మేకను కోసి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని, కారకులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు పాపయ్యగౌడ్‌, జంగయ్యయాదవ్‌, కుండె వెంకటేష్‌, మాధవాచారి, యాదీష్‌, మధుమోహన్‌, సుధాకర్‌, యాదగిరిరెడ్డి, శ్రవణ్‌, రాఘవేందర్‌, ఎం.రాజు, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:07 AM