Share News

అప్‌గ్రేడ్‌ సరే.. వసతులేవి?

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:31 PM

ఉమ్మడి జిల్లాలో ఏ ప్రభుత్వ ఆస్పత్రి చూసినా ఏమున్నది గర్వకారణం అన్న పరిస్థితి నెలకొంది. ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేసినా వసతులు, సిబ్బంది ఏర్పాటును మరిచారు. వేధిస్తున్న సిబ్బంది, వైద్యుల కొరతతో సకాలంలో వైద్యం అందక పేద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్థాయి పెరిగిన తొమ్మిది ఆస్పత్రుల్లో మొత్తం 333 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం 236 మంది మాత్రమే ఉన్నారు.

అప్‌గ్రేడ్‌ సరే.. వసతులేవి?

-ఆస్పత్రుల స్థాయి పెంచినా సౌకర్యాలు నిల్‌

-వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత

-అందుబాటులో లేని గైనకాలజిస్టులు

-గర్భిణులకు స్కానింగ్‌ కష్టాలు.. ప్రైవేట్‌కు పరుగులు

-పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు

-చేవెళ్ల ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌

-నిధులున్నా ప్రారంభం కాని ఆస్పత్రి నిర్మాణాలు

-అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రుల తీరుపై ప్రత్యేక కథనం

ఉమ్మడి జిల్లాలో ఏ ప్రభుత్వ ఆస్పత్రి చూసినా ఏమున్నది గర్వకారణం అన్న పరిస్థితి నెలకొంది. ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేసినా వసతులు, సిబ్బంది ఏర్పాటును మరిచారు. వేధిస్తున్న సిబ్బంది, వైద్యుల కొరతతో సకాలంలో వైద్యం అందక పేద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్థాయి పెరిగిన తొమ్మిది ఆస్పత్రుల్లో మొత్తం 333 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం 236 మంది మాత్రమే ఉన్నారు. కమ్యూనిటీ ఆస్పత్రులు ఏరియా ఆస్పత్రులుగా మారినా వసతుల లేమి వెక్కిరిస్తోంది. నిధులు మంజూరైనా పలు చోట్ల ఆస్పత్రుల భవన నిర్మాణాలు ప్రారంభం కాని దుస్థితి. చాలా చోట్ల గైనకాలజిస్టులు లేక గర్భిణులు ప్రైవేట్‌కు పరుగులు తీస్తున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయి పెంచినా వైద్య సిబ్బంది ఉన్న చోట సౌకర్యాలు లేవు.. సౌకర్యాలు ఉన్న చోట సిబ్బంది కొరత వేధిస్తుంది. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రాంతీయ ఆస్పత్రి స్థాయికి ఎదిగినా ఆ మేరకు సిబ్బంది కనిపించని దుస్థితి. 100 పడకల సామర్థ్యం ఎక్కడా కనిపించడం లేదు. కమ్యూనిటీ ఆస్పత్రులను ఏరియా ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేసినా అది ఆగితాలకే పరిమితమైంది. కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణం కోసం రూ.కోట్లు మంజూరైనా స్థల సేకరణ జరగక నిధులు మూలుగుతున్నాయి. గైనకాలజిస్టులు అందుబాటులో లేక నార్మల్‌ డెలీవరీల సంఖ్య భారీగా తగ్గింది. అల్ర్టాసౌండ్‌ మిషన్‌ లేక పోవడంతో హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు. ఒక వేళ స్కానింగ్‌ మిషన్‌ ఉంటే.. రేడియాలజిస్టు ఉండటం లేదు. దీంతో చాలా చోట్ల కోట్ల రూపాయలు చేసే విలువైన యంత్రాలు నిరుపయోగంగా మారాయి.

చేవెళ్ల ఆస్పత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత

రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో జిల్లా ఆసుపత్రితోపాటు వనస్థలిపురంలో ఏరియా ఆసుపత్రి ఉంది. చేవెళ్ల, షాద్‌నగర్‌, హయత్‌నగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌, యాచారంలో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు కొనసాగుతున్నాయి. ఈ సెంటర్లన్నీ అప్‌గ్రేడ్‌ చేశారు అయినా అదే దుస్థితి. చేవెళ్ల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ఆసుపత్రిగా 2022లో అప్‌గ్రేడ్‌ చేశారు. ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 17.50 కోట్లు మంజూరు చేసింది. అయినా ఏడాదిన్నర కాలంగా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కమ్యూనిటీ హెల్త్‌ హెల్త్‌ సెంటర్‌ స్థాయిలోనే 59 మంది వైద్య సిబ్బందికి 31 మంది ఉన్నారు. 20 మంది డాక్టర్లు ఉండాలి కానీ.. 11 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 11 మంది డాక్టర్లు కూడా స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. ఓపీ భారీగా పెరిగింది. ఆసుపత్రిలో బ్లెడ్‌ బ్యాంకు లేకపోవడంతో ఆపరేషన్‌ సమయంలో రక్తం కోసం నగరానికి పరుగులు తీస్తున్నారు.

చుట్టపు చూపులా డాక్టర్ల రాక

స్థానికంగా స్కానింగ్‌ మెషిన్లు లేక కడుపులో బిడ్డతో 42 కిలో మీటర్ల మేర ప్రయాణం చేసి నగరానికి వెళ్లి స్కానింగ్‌ చేయిస్తున్నారు. పేరుకే పెద్దాసుపత్రి అయినా ఇక్కడ గర్భిణులకు అవసమయ్యే అల్ర్టాసౌండ్‌ మిషన్‌ సైతం అందుబాటులో లేదు. గత 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం సరఫరా చేసిన యంత్రం పనిచేయడం లేదు. అల్ర్టాసౌండ్‌తో పాటు రేడియాలజిస్టు లేదు. ముగ్గురు గైనకాలజిస్టులు ఉన్నప్పటికీ.. ఒక్కరు కూడా అందుబాటులో ఉండటం లేరు. వారానికి రెండు సార్లు చుట్టపు చూపులా ఇలా వచ్చి అలా వెళుతున్నారు. ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి దగ్గరలో ఉంటంతో అక్కడికి రెఫర్‌ చేస్తున్నారు ల్యాబ్‌ టెక్నిషియన్‌ ఒక్కరే ఉండటంతో ఇబ్బందులు నెలకొంటున్నారు.

రూ. 80 లక్షల ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిరుపయోగం

కరోనా సమయంలో ఆక్సీజన్‌ కోసం అల్లాడుతున్న సమయంలో భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) ప్రతినిధులు రూ. 80 లక్షలు ఖర్చు పెట్టి ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనికి అవసరమైన రూ.10 లక్షలకు పైగా విలువైన జనరేట్‌ను స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు ఇచ్చారు. ఏ ఒక్క రోజు కూడ ఈ ప్లాంట్‌ను వినియోగించిన దాఖలాలు లేవు. దీంతో జనరేటర్‌ కూడా ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ దర్శనమిస్తుంది. ప్రత్యేకంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లేకపోవడంతో ఓల్టేజీలో హెచ్చుతగ్గులతో డయాలసిస్‌ కేంద్రంలో ఇటీవల షాట్‌ సర్క్యూట్‌ వచ్చి వైరింగ్‌ మొత్తం పాడైంది.

షాద్‌నగర్‌లో ల్యాబ్‌ పరికరాలు కరువు

షాద్‌నగర్‌ కమ్యూనిటీ అస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ 2023లో ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే భవన నిర్మాణం కోసం రూ. 5 కోట్లు మంజూరు చేయడంతో షాద్‌నగర్‌ పట్టణ శివారులోని లింగారెడ్డిగూడ ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టారు. పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడం, చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ చొరవ తీసుకుని సదరు కాంట్రాక్టర్‌కు పాత బకాయిలు చెల్లించడంతో పాటు, నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రిలో 80 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం 40 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. వైద్య సిబ్బందితో కలిపి 40 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం 22 మంది వైద్యులు ఉన్నారు. వైద్య సిబ్బందికి అనుగుణంగా నర్సులు అందుబాటులో లేరు. ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారు. అలాగే ఫార్మసీలో నలుగురు సిబ్బంది అవసరం ఉంది. అయినా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆస్పత్రిలో సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, ల్యాబ్‌ పరికరాలు అందుబాటులో లేవు.

ఆమనగల్లులో ఓపీ మాత్రమే

ఆమనగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2021 డిసెంబర్‌ల 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. కానీ.. నేటికి పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది, బెడ్స్‌ లేవు. 32 మంది వైద్య సిబ్బందికి గాను 24 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆస్పత్రి భవనం కోసం రూ.17.50 కోట్లు మంజూరు కావడంతో పాత భవాన్ని తొలగించి అదేస్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దీంతో తాత్కాలికంగా ఆసుపత్రి డాక్టర్‌ క్వార్టర్‌లో కొనసాగిస్తున్నారు. భవనం లేని కారణంగా ఆసుపత్రి ఓపి సేవలకే పరిమితమైంది. ఆసుపత్రిని సీహెచ్‌సిగా అప్‌గ్రేడ్‌ చేసినా వైద్య సేవలు మెరుగుపడలేవు.

వేధిస్తున్న డ్రగ్స్‌ కొరత

30 పడకలుగా ఉన్న మహేశ్వరం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 50 పడకల కోసం అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ.. 16 మంది డాక్టర్లకు 12 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇబ్రహీంపట్నంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసిన తర్వాత పది మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఐదుగురు మాత్రమే ఉన్నారు. గైనకాలజిస్టు, అనస్థిషియా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ హైపర్‌ టెన్షన్‌ (ఎన్సిపి డ్రగ్స్‌) కొరత ఉంది.

సర్జన్స్‌ లేక నిలిచిన సర్జరీలు

వికారాబాద్‌ జిల్లా పరిగిలోని కమ్యూనిటి హెల్త్‌ సెంటర్‌ అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ.. ఇక్కడ యంత్రాల కొరత వేధిస్తోంది. డాక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎక్స్‌రే, డెంటల్‌ చైర్‌ అందుబాటులో లేదు. ఆస్పత్రిలో నిత్యం 400 నుంచి 500 వరకు ఓపీ రోగులు వస్తున్నారు. 15 నుంచి 25కు ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. కొన్ని రకాల మందులు ఆసుపత్రిలో లేకపోవడంతో బయటకు రాస్తున్నారు. కొడంగల్‌లోని 30 పడకల ఆసుపత్రిని 50 పడకలగా అప్‌గ్రేడ్‌ చేశారు. అయినా 11 మంది వైద్య సిబ్బందికి పది మంది ఉన్నారు. ఆపరేషన్‌ థియేటర్‌ ఉన్నప్పటికీ.. సర్జన్‌ లేకపోవడంతో ఆపరేషన్లు జరగడం లేవు. కొడంకగల్‌కు మంజూరైన మెడికల్‌ కాలేజీకి అసుపత్రిని అనుసందించారు. మేడ్చల్‌ జిల్లా శామిర్‌పేటలోని పీహెచ్‌సీని 2021లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా ఆప్‌గ్రేడ్‌ చేశారు. 30 మంది వైద్య సిబ్బందికి గాను 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరడం లేదు.

పేరుకే పెద్ద ఆస్పత్రి

చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే ఏరియా ఆసుపత్రి. ఇక్కడ రోగులకు అవసరమైనా ఎలాంటి సౌకర్యాలు లేవు. దీంతో వైద్యులు చిట్టీ రాసి ఇతర ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ఇంత మంది వైద్యులు ఉండి కూడా ఏమీ లాభం లేదు. నిత్యం ఓపీ చూసి పంపిస్తున్నారే తప్ప ఆపరేషన్లు చేసిన దాఖాలాలు లేవు. ఉన్నతాధికారులు స్పందించాలి. అవసరమైన సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలి. అలాగే వైద్యులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.

-పి. మల్లారెడ్డి, చేవెళ్ల పట్టణం

Updated Date - Oct 23 , 2024 | 12:11 AM