Share News

ఓటు నమోదు శిబిరాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Jan 19 , 2024 | 11:30 PM

ఓటరు నమోదుకు ఈ నెల 22 తుది గడువని, ఓటరు నమోదు ప్రక్రియ వేగం పెంచేందుకు నేడు, రేపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేశామని, అర్హులందరూ వినియోగించుకోవాలని షాద్‌నగర్‌ ఆర్డీవో వెంకటమాధవరావు తెలిపారు.

ఓటు నమోదు శిబిరాలను వినియోగించుకోవాలి

షాద్‌నగర్‌/మంచాల/కేశంపేట/ఆమనగల్లు, జనవరి, 19: ఓటరు నమోదుకు ఈ నెల 22 తుది గడువని, ఓటరు నమోదు ప్రక్రియ వేగం పెంచేందుకు నేడు, రేపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేశామని, అర్హులందరూ వినియోగించుకోవాలని షాద్‌నగర్‌ ఆర్డీవో వెంకటమాధవరావు తెలిపారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2024 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఫిబ్రవరి 2 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి 8న ఓటరు జాబితాను ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 2లక్షల 37వేల, 945 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,19,698 మంది పురుష ఓటర్లు, 1,18,233 మంది మహిళా ఓటర్లు, 14మంది ట్రాన్స్‌ జెండర్‌ పర్సన్‌ ఓటర్లు ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6021 మంది ఓటుహక్కు కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 3076 మంది ఓటర్లు మరణించగా, 891 డబుల్‌ ఓట్లను తొలిగించామని చెప్పారు. ఓటరు జాబిత సవరణలు చేసుకోవాలనుకునే వారు ఫాం-8ను వినియోగించుకోవాలన్నారు. తహసీల్దార్‌ పార్థసారధి పాల్గొన్నారు. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన యువత ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని మంచాల మండల తహసీల్దారు ప్రసాద్‌రావు సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్త ఓటు నమోదు, చేర్పులు, మార్పుల కోసం ఈ నెల నేడు, రేపు ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వివిధ పోలింగ్‌ స్టేషన్లలో బూత్‌లెవల్‌ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హత గల వారందరూ సద్వినియోగం చేసుకుని ఓటుహక్కును నమోదు చేసుకోవాలని చెప్పారు. అలాగే కేశంపేట మండలంలో నేడు, రేపు ఓటు నమోదుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్‌ మీర్‌ అజాంఅలీ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలలో బీఎల్‌వోలు ఫాం 6, ఫాం 7లను తీసుకుంటారని చెప్పారు. అలాగే ఆమనగల్లు మండలంలోని 35 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో నేడు, రేపు(శని, ఆది) ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్‌ లలిత తెలిపారు. 2024 జనవరి 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. అన్ని పోలింగ్‌ భూత్‌లలో రెండు రోజులు బీఎల్వోలు అందుబాటులో ఉంటారని, ఓటర్ల జాబితాలో ఏమైనా సవరణలు, మార్పులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

సరిగా కనిపించని ఓటరు లిస్టు

కేశంపేట, జనవరి 19: మండలంలోని ఎక్లా్‌సఖాన్‌పేటలో పోలింగ్‌ బూత్‌ నెంబరు 114లో గోడలకు అతికించిన ఓటరు లిస్టు స్పష్టంగా కనిపించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నూతనంగా నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లు కనిపించేలా ఆయా పోలింగ్‌ బూత్‌లలో బీఎల్వోలు లిస్టును గోడలకు అతికిస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 114లో నూతన ఓటరు లిస్టు ఎవరికీ కనబడకుండా తలుపుపై భాగంలో అతికించారు. ఓటరులిస్టు ఇలా అతికించడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jan 19 , 2024 | 11:30 PM