Share News

వార్డు ఆఫీసర్లు వచ్చేస్తున్నారు!

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:52 PM

బీఆర్‌ఎస్‌ పాలనలో అస్తవ్యస్థమైన మున్సిపల్‌ వ్యవస్థను చక్కదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయి.

వార్డు ఆఫీసర్లు వచ్చేస్తున్నారు!
తాండూరు మున్సిపల్‌ కార్యాలయం

  • నాలుగు మున్సిపాలిటీల్లో 97 వార్డులు

  • కొడంగల్‌, పరిగికి పూర్తిస్థాయి కమిషనర్లు

  • ప్రజలకు అందనున్న మెరుగైన సేవలు

  • ప్రక్షాళన దిశగా మున్సిపల్‌ వ్యవస్థ

తాండూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో అస్తవ్యస్థమైన మున్సిపల్‌ వ్యవస్థను చక్కదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రజా అవసరాలను గుర్తించి చర్యలు తీసుకోనేందుకు వార్డుకో అధికారిని నియమించారు. పూర్తిస్థాయిలో వార్డు ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. మున్సిపల్‌లో పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కమిషనర్‌ నుంచి కింది స్థాయి వరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా మంగళ, బుధవారాల్లో వార్డు ఆఫీసర్లు, అకౌంటెంట్‌లు మున్సిపల్‌లో బాధ్యతలు చేపట్టే ప్రక్రియ కొనసాగుతుంది. తాండూరుతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది.

కమిషనర్‌ పోస్టులు

కొత్తగా ఏర్పాడిన కొడంగల్‌, పరిగి మున్సిపాలిటీలకు గత నాలుగేళ్లుగా కమిషనర్‌ పోస్టులు మంజూరు కాలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రెండు పోస్టులను మంజూరు చేసింది. కొడంగల్‌, పరిగికి పూర్తిస్థాయి కమిషనర్‌ నియామకమయ్యారు.

వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ

తాండూరు మున్సిపాలిటీలో 36వార్డులు ఉన్నాయి. ఇందులో 16వార్డులకు వార్డు ఆఫీసర్లు ఉండగా ఖాళీగా ఉన్న 20పోస్టులను మంజూరు చేసి గ్రూప్‌- 4 కింద నియమకం చేపట్టి 20పోస్టులను భర్తీ చేసింది. కొడంగల్‌లో 12వార్డులు ఉండగా అక్కడ ఇప్పటి పూర్తిస్థాయి వార్డు ఆఫీసర్లు ఉన్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 34వార్డులు ఉండగా ఇప్పటికే ఆరుగురు కొనసాగుతుండగా 28మందిని కొత్తగా నియమించారు. పరిగిలో 15వార్డులుండగా 14మంది వార్డు ఆఫీసర్లు ఉండటంతో కొత్తగా ఒకరిని నియమించారు.

జూనియర్‌ అకౌంటెంట్ల నియామకం

తాండూరుతో పాటు కొడంగల్‌, పరిగిలకు కొత్తగా జూనియర్‌ అకౌంటెంట్‌ ఆఫీసర్లను నియమించారు. దీంతో అకౌంటింగ్‌ పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. గతంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అకౌంట్‌ విభాగాన్ని చూసేవారు. ప్రస్తుతం అకౌంట్స్‌ విభాగం కొత్త వారిని నియమించడంతో మున్సిపాలిటీలు గాడిలో పడనున్నాయి.

వార్డు ఆఫీసర్ల విధులు

రోజువారీ పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణ, శానిటరీ మాస్టర్స్‌, కార్మికుల పనిని పర్యవేక్షించుట, డోర్‌ టూ డోర్‌ చెత్త సేకరణ, వ్యర్థాల విభజన, ప్లాస్టిక్‌ నిషేదం, వార్డు లేవల్‌ శానిటేషన్‌ ప్లాన్‌ అమలు చేయడం, మురుగుకాల్వలు, పబ్లిక్‌ టాయిలెట్లను శుభ్రం చేయించడం, అంటు వ్యాధుల నివారణ, నియంత్రణకు చర్యలు, ప్రభుత్వ, ప్రైవేటు, మార్కెట్లు, మటన్‌, చికెన్‌ స్టాల్స్‌ స్లాటర్‌హౌస్‌లను చక్కగా శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చేపట్టాలి. ఘన, ద్రవ వ్యర్థాల నివారణ, వీధి దీపాల, నీటి సరఫరా పర్యవేక్షణ చేయాలి. ఇంటి పన్నులను, హరితహరం వంద శాతం చేపట్టాలి. నర్సరీలు, ప్లాంటేషన్‌, ఎవెన్యూ, ట్రీపార్కులను అభివృద్ధి పర్చాలి. సామాజిక భద్రత పథకం కింద పింఛన్లు, సంక్షేమ పథకాలు, పట్టణ పేదరికం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. పలు రకాల పన్నులు, చార్జీలను, ఆస్తి పన్ను యొక్క నెలవారీ జాబితాలు తయారు చేసి కార్యాలయంలో అందజేయాలి.

Updated Date - Dec 22 , 2024 | 11:52 PM