నర్సింగ్ కళాశాలలో సకల వసతులు కల్పిస్తాం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:01 AM
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగల్‌పల్లిలో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలలో వైద్య పరికరాలతోపాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగల్‌పల్లిలో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలలో వైద్య పరికరాలతోపాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం మంగల్‌పల్లిలో భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆరోగ్య దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వర్చువల్ పద్ధతిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, మైత్రి ట్రాన్స్ క్లినిక్‌ను మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా, ఇక్కడ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో అనంతరెడ్డితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతకుముందు నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, తహసీల్దారు సునీతారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.