సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:25 AM
మహిళా సఫాయి కర్మచారిల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అంతరంగిక కమిటీలను ఏర్పాటుచేసి వేధింపులు, తదితర సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ, సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ ఎం.వెంకటేషన్ తెలిపారు.
జాతీయ ఎస్సీ, ఎస్టీ, సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేషన్
మేడ్చల్ ప్రతినిధి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మహిళా సఫాయి కర్మచారిల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అంతరంగిక కమిటీలను ఏర్పాటుచేసి వేధింపులు, తదితర సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ, సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ ఎం.వెంకటేషన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సఫాయి కర్మచారి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరైన వెంకటేషన్ మాట్లాడుతూ సఫాయి కర్మచారిలు ఏవైనా సమస్యలుంటే అధికారులకు తెలియజేయాలని, పరిష్కారం కాకుంటే యూనియన్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అక్కడ కూడా పరిష్కారం కాకుంటే హెల్ప్‌లైన్ నెంబర్ 01124648924 ద్వారా కమిషన్‌కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. ప్రతీ మున్సిపాలిటీకి చెందిన సఫాయి కర్మచారిలను వేదిక వద్దకు పిలిచి.. జీతం సరిగ్గా వస్తుందా? ఏమైనా కోతలు విధిస్తున్నారా? అని అడిగారు. అనంతరం వారి ఫోన్లలో జీతం పడిన తేదీలను పరిశీలించారు. కొంతమందికి తక్కువ జీతం పడటంతో మున్సిపల్ కమిషనర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఫాయి కర్మచారిలకు యూనిఫాం, ఐడీ కార్డులు, నెలలో నాలుగు రోజుల సెలవులు వంటి విషయాలతో పాటు వారి హక్కులను తెలియజేయాలని చైర్మన్ సూచించారు. నెలకోసారి వారిని కలిసి సమస్యలు తెలుసుకోవాలని లేబర్ కమిషనర్‌ను ఆదేశించారు. జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి వినోద్‌కుమార్ తదితరులున్నారు.