సంక్షేమ పథకాలు ఎస్సీలకు అందాలి
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:32 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఎస్సీలకు అందేలా చూడాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు.
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్
రంగారెడ్డి అర్బన్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఎస్సీలకు అందేలా చూడాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా, పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్, ఎస్సీ జూనియర్ అడ్వకేట్లకు ప్రోత్సాహకాలు, గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఎస్సీ కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు, మంజూరైన నిధుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలలో ఎస్సీలకు సబ్సిడీ యూనిట్ల వివరాలు, ఎస్సీలకు పంపిణీ చేసిన భూముల పరిరక్షణలో రెవెన్యూశాఖ దృష్టి సారించాలని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు. ఎస్సీల సంక్షేమానికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీత, ఎల్బీనగర్ డీసీపీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.