రైతులకు సమాచారమివ్వకుండా భూసేకరణ చేయడమేంటి?
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:21 PM
రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వారి పట్టా భూములను ఫ్యూచర్ సిటీ కొరకు రోడ్డు వేసేందుకు అఽధికారులు భూసేకరణ సర్వే చేయడం ఏమిటని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు రైతుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తాము ఊరుకునేది లేదని తెలిపారు.
బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్
కందుకూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి) : రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వారి పట్టా భూములను ఫ్యూచర్ సిటీ కొరకు రోడ్డు వేసేందుకు అఽధికారులు భూసేకరణ సర్వే చేయడం ఏమిటని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు రైతుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తాము ఊరుకునేది లేదని తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మండటంలోని బేగరికంచ, మీర్కాన్‌పేట గ్రామ పంచాయతీల పరిధిలో నెలకొల్పనున్న ఫ్యూచర్‌సిటీకి ఔటర్ రింగ్‌రోడ్డు, రావిరాల ఎగ్జిట్ 13 నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 300 ఫీట్ల రోడ్డు వేయడానికి రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తాతల నాటి నుంచి పట్టా భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని, రోడ్డు కొరకు భూసేకరణ చేసే సమయంలో సమాచారం ఇవ్వకుండా శనివారం మండలంలోని రాచులూరు, బేగంపేట, తుర్కగూడ గ్రామాల్లో అఽధికారులు సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు క్లుప్తంగా వివరించాకే ముందుకెళ్లాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట పలువురు నాయకులు తదితరులున్నారు.