షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభమెప్పుడో?
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:41 PM
ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో కొత్తగా నిర్మాణం చేసిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర కావస్తున్నా.. ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాంతో వ్యాపారులు, ప్రజలు ఒప్పుడు ఓపెనింగ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
వృథాగా ‘పట్నం’ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయం
నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర.. విద్యుత్ మీటర్ల బిగింపులో జాప్యం
ఇబ్రహీంపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో కొత్తగా నిర్మాణం చేసిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర కావస్తున్నా.. ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాంతో వ్యాపారులు, ప్రజలు ఒప్పుడు ఓపెనింగ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై ఉన్న మార్కెట్ యార్డులో వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. రూ.1.20 కోట్ల వ్యయంతో 17 దుకాణాలతో కాంప్లెక్స్ నిర్మా ణం చేశారు. కాగా, ఈ మడిగె(దుకాణాలు)ల్లో విద్యుత్ మీటర్లు బిగించాల్సి ఉంది. దీనికిగాను డీడీలు కట్టినా.. ఇంతవరకు మీటర్లు బిగించలేకపోయారు. అంతేకాకుండా షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఉన్న సీసీ రోడ్డు మధ్యలో రెండు విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితేగానీ ఇంజనీరింగ్ విభాగం కాంప్లెక్స్‌ను మార్కెట్ యార్డుకు అప్పగించనుంది. అప్పుడుగాని షాపింగ్ కాంప్లెక్స్ మడిగెలు వేలం వేస్తే మార్కెట్‌కు నెలకు రూ.రెండు లక్షలపైనే ఆదాయం సమకూరుతుంది. నిర్మాణం పూర్రతయి 18 నెలలైనా ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడంపై వ్యాపారులు, ప్రజలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తెస్తాం
ఈ నెలాఖరులోగా నూతనంగా నిర్మించిన మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చి వేలం పద్దతిన మడిగెలు(దుకాణాలు) కేటాయించాలని నిర్ణయించాం. రోడ్డు మధ్యలో ఉన్నవిద్యుత్ పోల్స్ షిఫ్టింగ్, మడిగెల్లో మీటర్లు బిగించాల్సి ఉంది. ఇప్పటికే కొత్తగా మీటర్ల బిగింపునకు డీడీలు కూడా కట్టేశాం.
- ఎన్.సంతో్‌షకుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి