Share News

ఉంచుతారా? తొలగిస్తారా?

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:32 PM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులను ఉంచుతారా? తొలగిస్తారా? అనే సందిగ్ధత వీడటం లేదు. జిల్లాలో 28 గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. తమ ఉద్యోగాల భవిష్యత్‌ ఏమిటో తెలియక ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.

ఉంచుతారా? తొలగిస్తారా?

-విలీన పంచాయతీల్లో వీడని సందిగ్ధత

-ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన

-ప్రశ్నార్థకంగా దాదాపు 350 మంది జీవితాలు!

మేడ్చల్‌ ప్రతినిధి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులను ఉంచుతారా? తొలగిస్తారా? అనే సందిగ్ధత వీడటం లేదు. జిల్లాలో 28 గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. తమ ఉద్యోగాల భవిష్యత్‌ ఏమిటో తెలియక ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. విలీనమైన పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ప్రస్తుతం యథావిధిగా ఆయా బల్దియాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాకీ వారికి ఇప్పటి వరకు మున్సిపాలిటీ ఉద్యోగులుగా, కార్మికులుగా గుర్తించడం లేదు.

500 మంది జనాభాకు ఒకరు చొప్పున

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో ప్రవేశపెట్టిన జీఓ 51 అమలుపై పంచాయతీరాజ్‌ శాఖ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తమ ఉద్యోగాల భవిష్యత్‌ ఏమిటోనన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాల్టీల్లో విలీనమైన తర్వాత తమ వేతనాలు పెరుగుతాయని భావించిన సంబంధిత ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. జీఓ 51 నిబంధనల ప్రకారం పంచాయతీల్లో 500 మంది జనాభాకు ఒక ఉద్యోగి చొపుపన మల్టీపర్పస్‌ వర్కర్‌ను నియమించుకోవాల్సి ఉంది. ఈ జీఓ ప్రకారం పంచాయతీరాజ్‌ శాఖ పంచాయతీల్లో ఉన్న అదనపు సిబ్బందిని తొలగించే పనిలో నిమగ్నమైంది. దీంతో మున్సిపాల్టీల్లో విలీనమైన ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. విలీన గ్రామాల్లో అదనంగా పనిచేస్తున్న 350 మంది ఉద్యోగుల తొలగింపుపై సందిగ్ధత నెలకొంది. మున్సిపాల్టీల్లో విలీనమైన పంచాయతీ ఉద్యోగులను, కార్మికులను బల్దియా సిబ్బందిగా గుర్తించకపోగా, పంచాయతీరాజ్‌ శాఖ అదనపు సిబ్బందిని గుర్తించే నివేదిక రూపొందిస్తుండటంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని వారు ఆందోళన చెందుతున్నారు.

రెండు నెలలుగా అందని వేతనాలు

రెండు నెలలుగా విలీనమైన గ్రామాల సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించడం లేదు. దీంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. తమ వేతనాల కోసం ఇటు మున్సిపాలిటీలు, అటు పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ తయారు చేసిన జాబితాపై ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామాల్లో పెరిగిన జనాభాకనుగుణంగా ఉద్యోగులు, కార్మికులను నియమించారని జీఓ నంబరు 51ను కూడా రద్దు చేశారని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 350 మంది ఉద్యోగులు, కార్మికులు తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - Dec 02 , 2024 | 11:32 PM