వామ్మో.. వానరాలు!
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:18 PM
మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైంది. మనుషులు కనబడితే చాలు మీద దునుకుతూ దాడి చేస్తున్నాయి. మనుషులు లేని సమయాల్లో ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను తీసుకెళ్లి రోడ్లపై పడేస్తున్నాయి.
-ఇళ్లలోకి చొరబడుతున్న కోతులు
-ప్రజలపైకి ఎగబడుతూ దాడులు
-కాళ్లు, చేతులు విరిగి ఆస్పత్రి పాలు
-బెంబేలెత్తిపోతున్న కందుకూరు మండల ప్రజలు
కందుకూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైంది. మనుషులు కనబడితే చాలు మీద దునుకుతూ దాడి చేస్తున్నాయి. మనుషులు లేని సమయాల్లో ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను తీసుకెళ్లి రోడ్లపై పడేస్తున్నాయి. ఇళ్లలోకి వచ్చిన వానరాలను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన ఐదు మంది కిందపడి కాళ్లు, చేతులు విరిగి ఆస్పత్రి పాలయ్యారు. మండల కేంద్రంతోపాటు కొత్తగూడ తదితర గ్రామాల్లో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి.
నగరానికి అతి సమీపంలో ఉన్న కందుకూరు మండంలో రైతులు వ్యవసాయ రంగంపై అధారపడి జీవనం సాగించే వారు. ఏదారేళ్లుగా ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందడంతో వ్యవసాయ భూములు ప్లాట్లుగా, ఫాంహౌ్‌సలుగా మార్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని చెట్లను నరికేశారు. దీంతో వ్యవసాయ క్షేత్రాల్లో ఉండే వానర సైన్యం ఊళ్ల మీద పడుతోంది. అలాగే మండల కేంద్రంలోని పలు ఫంక్షన్ హాల్‌లలో సైతం కోతులు తిష్టం వేసి అక్కడి వస్తువులను చిందరవందరగా చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మండల కేంద్రంలో వానరసైన్యం ఇళ్లల్లోకి వచ్చి దాడులు చేయడంతో ఇటీవల సౌడపు సుజాత, బొక్క రాంచంద్రారెడ్డి, యాలాల శ్రీనివా్‌సరెడ్డి, ఇలా కందుకూరులో వానరసైన్యం ప్రజలపై ప్రతి నిత్యం దాడులు చేస్తునే ఉన్నాయి.
కోతుల బెడద ఎక్కువైంది
రోజురోజుకు కోతుల బెడద ఎక్కువైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. పిల్లలను దుకాణాలకు పంపిచాలంటే భయం వేస్తోంది. ఇంటి ఆవరణలో ఏవైనా ధాన్యం ఆరబోసుకోవాలంటే కూడా ఇబ్బందిగా మారింది. నేను ఇటీవల ఇంటి పై నుంచి కిందకు వస్తుండగా కోతులు ఒక్కసారిగి నాపై దాడి చేశాయి. ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి వెనుకకు పరుగెత్తడానికి ప్రయత్నించి కిందపడటంతో రెండు కాళ్లు విరిగాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడదను అరికట్టాలి.
-సౌడపు సుజాత, కొత్తగూడ
వీధుల్లో తిరుగలేక పోతున్నాం
కందుకూరులో వీధుల్లో తీరుగలేక పోతున్నాం. ఎప్పుడు కోతుల గుంపు దాడిచేస్తుందోనని భయంతో బతుకుతున్నాం. మూడేళ్లుగా కోతుల గుంపు ఇబ్బంది పెడుతోంది. ఇంత జరగుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం వాటిని అడవుల్లోకి తరలించడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ఇళ్లలో ఉన్న మహిళలు మధ్యాహ్నం వేళల్లోనూ డోర్లు మూసుకోని ఉండాల్సి వస్తోంది. నేను ఉదయం వేళలో దేవాలయానికి వెళ్లగా ఆక్కడ కోతుల గుంపు నాపై దాడి చేశాయి. ఆ ప్రమాదంలో నా ఎడమ కాలు విరిగింది. ఇలాగే చాల మందికి గాయాలై అవస్థలు పడుతున్నారు.
-యాలాల శ్రీనివా్‌సరెడ్డి, కందుకూరు