యాలాల లింగాలు.. కోవూరు జంగాలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:20 AM
యాలాల గ్రామం రామలింగాలకు ప్రతీక. గ్రామం చుట్టూ ఎక్కడ చూసినా రైతుల పొలాల్లో రామలింగాలే దర్శనమిస్తాయి. అందుకేనేమో ఈ గ్రామానికి ‘యాలాల లింగాలు.. కోవూరు జంగాలు’ అని నానుడి ఉంది.
యాలాల చుట్టూ సుమారు 100 రామలింగాలు
పూర్వకాలం శ్రీరాముడే
ప్రతిష్ఠించాడని ప్రతీతి
రానురాను తగ్గిన విగ్రహాల సంఖ్య
ఈ లింగాలపై 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి రీసెర్చ్
యాలాల, నవంబరు 13 : యాలాల గ్రామం రామలింగాలకు ప్రతీక. గ్రామం చుట్టూ ఎక్కడ చూసినా రైతుల పొలాల్లో రామలింగాలే దర్శనమిస్తాయి. అందుకేనేమో ఈ గ్రామానికి ‘యాలాల లింగాలు.. కోవూరు జంగాలు’ అని నానుడి ఉంది. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి శ్రీరాముడు వచ్చి గ్రామం చుట్టూరా రామలింగాలను ఏర్పాటు చేశారని ఈ గ్రామ ప్రజల నమ్మకం. అప్పట్లో గ్రామం చుట్టుముట్టు గల రైతు పొలాల్లో దాదాపు 100 రామలింగాలు ఉండేవని, కొన్ని లింగాలను ఇతర ప్రాంతాల వ్యక్తులు తీసుకెళ్లారని చర్చించుకుంటున్నారు.
మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ అధికారి ఇక్కడి లింగాలను తీసుకెళ్లి అక్కడి మ్యూజియంలో భద్రపర్చారని పేర్కొంటున్నారు. 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి యాలాలకు వచ్చి ఇక్కడి లింగాలపై రీసెర్చ్ కూడా చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వందల సంవత్సరాల నుంచి గ్రామం చుట్టూ వందల సంఖ్యలో లింగాలున్నాయి. రాను రాను వాటి సంఖ్య తగ్గిపోయింది. కొన్ని లింగాలు భూమి లోపలికి కూరుకుపోగా, మరికొన్ని లింగాలు ఇతర ప్రాంతాల వ్యక్తులు తీసుకుపోగా, ప్రస్తుతం పొలాల్లో అక్కడక్కడ మాత్రమే రామలింగాలు దర్శనమిస్తున్నాయి.
యాలాలతోపాటు యాలాల అనుబంధ గ్రామమైన గోవిందరావుపేట చుట్టూ కూడా లింగాలు ఉన్నాయి. యాలాల, గోవిందరావుపేట గ్రామాల్లో అప్పట్లో అత్యధికంగా చిన్న చిన్న గుడులు కూడా ఉండేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాగా ఆ గుడులన్నీ ప్రస్తుతం కనుమరుగయ్యాయి. ఒకప్పుడు యాలాలో బంగారాన్ని రాశులు పోసి అమ్మే వారని నానుడి. ఇప్పటికీ కొన్ని శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో బంగారం ఉన్నట్లు స్థానికులు నమ్ముతుంటారు. కాలక్రవేణి నది గ్రామం చుట్టూ ప్రవహించడంతో శ్రీరాముడు ఈ ప్రాతానికి వచ్చి రామలింగాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుని ఉండొచ్చని చరిత్రకారులు చెబతున్నారు.