Share News

రియాక్టర్లు బద్దలై శరీరాలు ఛిద్రమై

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:52 AM

బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమలో రియాక్టర్లు పేలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవ్వగా.. 20 మంది కార్మికులు తీవ్ర గాయాలపాయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ గ్రామ శివారులోని

రియాక్టర్లు బద్దలై శరీరాలు ఛిద్రమై

సంగారెడ్డి జిల్లా హత్నూర ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో భారీ పేలుడు

పరిశ్రమ డైరెక్టర్‌ సహా.. ఐదుగురి దుర్మరణం

ఎగిసిన మంటలు.. మరో నలుగురు మృతిచెంది ఉంటారని అనుమానం

20 మందికి గాయాలు.. నలుగురు విషమం.. భయంతో పరుగులు తీసిన కార్మికులు

గవర్నర్‌ రాధాకృష్ణన్‌, సీఎం రేవంత్‌ దిగ్ర్భాంతి.. మంత్రులు దామోదర, సురేఖ సంతాపం

హత్నూర, ఏప్రిల్‌ 3: బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమలో రియాక్టర్లు పేలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవ్వగా.. 20 మంది కార్మికులు తీవ్ర గాయాలపాయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ గ్రామ శివారులోని ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో చోటుచేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల కథనం ప్రకారం.. ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో బుధవారం జనరల్‌ షిఫ్ట్‌ (ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30)లో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సహా.. మొత్తం సుమారు 60 మంది విధులకు హాజరయ్యారు. ఈ పరిశ్రమలో బల్క్‌ డ్రగ్స్‌, ఫార్మా కంపెనీలకు కావాల్సిన గ్రాన్యూల్స్‌/పెల్లెట్స్‌ తయారు చేస్తారు. సాయంత్రం షిఫ్ట్‌ ముగిసే సమయంలో.. పరిశ్రమలోని రియాక్టర్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఆయిల్‌ బాయిలర్‌ వద్ద ఈ ఘటన జరగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌, వ్యవస్థాపక యజమానుల్లో ఒకరైన రవికుమార్‌(45), ప్రొడక్షన్‌ ఇన్‌చార్జులు సుబ్రమణ్యం(38), దయానంద్‌(46), మెయింటెనెన్స్‌ మేనేజర్‌ సురేశ్‌పాల్‌(45), చాకలి సురేశ్‌(35) అక్కడికక్కడే మృతిచెందారు. రవికుమార్‌ ఏపీలోని గుంటూరు జిల్లా గురజాలకు, సురేశ్‌పాల్‌ మధ్యప్రదేశ్‌కు, దయానంద్‌ తమిళనాడుకు, సుబ్రమణ్యం ఏపీకి చెందినవారు. మరో నలుగురు కార్మికులు కూడా మృతిచెంది ఉంటారని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఆ పరిసరాల్లో విధులు నిర్వర్తిస్తున్న, విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రులిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి, పరిస్థితిని వివరించారు.

మా వాళ్లు క్షేమమేనా..?

ప్రమాదం వార్త తెలియగానే స్థానికులు పెద్ద సంఖ్యలో ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఆ పరిశ్రమలో పనిచేసే తమవారి క్షేమ సమాచారం కోసం కన్నీటిపర్యంతం ఆరా తీశారు. ఇక్కడ పనిచేసే కార్మికుల్లో సింహభాగం బిహార్‌కు చెందినవారని తెలుస్తోంది. నలుగురు కార్మికులు గల్లంతయ్యారనే సమాచారం అందడంతో.. ‘‘అయ్యా.. మమ్మల్ని లోనికి వెళ్లనివ్వండి. మా వాళ్లు ఎలా ఉన్నారో చూడాలి’’ అంటూ అక్కడికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకోవడం కనిపించింది.

గవర్నర్‌, సీఎం దిగ్ర్భాంతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో ప్రమాదం పట్ల గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Apr 04 , 2024 | 05:52 AM