Share News

‘రియల్‌’ ఢమాల్‌

ABN , Publish Date - Dec 12 , 2024 | 11:54 PM

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలవుతోంది. కొన్నాళ్లుగా జోరు మీదున్న స్థిరాస్తి రంగం నానాటికీ అధోగతికి చేరుకుంటోంది. సాధారణ స్థితికి భిన్నంగా ఏడాదిన్నరగా స్థిరాస్తి వ్యాపారం అంతగా సాగడం లేదు. అమ్మేవారు తప్ప కొనేవారు ఎవరూ లేకపోవడంతో బిజినెస్‌ మందగించింది.

‘రియల్‌’ ఢమాల్‌

ఏడాదిన్నరకు పైగా మందగించిన బిజినెస్‌

అమ్మే వారున్నా కొనేవారు కరువు

రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి పెద్ద దెబ్బ

ప్లాట్ల ధరలు తగ్గుతున్నా లావాదేవీలకు ముందుకురాని వైనం

జనగామ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలవుతోంది. కొన్నాళ్లుగా జోరు మీదున్న స్థిరాస్తి రంగం నానాటికీ అధోగతికి చేరుకుంటోంది. సాధారణ స్థితికి భిన్నంగా ఏడాదిన్నరగా స్థిరాస్తి వ్యాపారం అంతగా సాగడం లేదు. అమ్మేవారు తప్ప కొనేవారు ఎవరూ లేకపోవడంతో బిజినెస్‌ మందగించింది. వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల(ప్లాట్ల) అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాలు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. భూముల ధరలు విపరీతంగా ఉండడం, కొన్న తర్వాత మళ్లీ పెరిగే అవకాశం కనిపించకపోవడం వంటి కారణాలతో రియల్‌ రంగం అంతకంతకు మందగిస్తోందని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్న మాట.

ఎన్నికల తర్వాత మరింత దిగజారి..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థిరాస్తి వ్యాపారం మరింత దిగజారిపోయింది. రియల్‌ ఎస్టేట్‌లో రాణించి రాజకీయంలో రావడమా? రాజకీయంలో వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రవేశించడమో తెలియదు కానీ.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎక్కువగా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో ఎక్కువగా రాజకీయ నాయకులే ఉంటుంటారు. మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో మొదలుకొని కింద స్థాయి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిఽధులు భూములు కొంటుంటారు. వీరు తమ బినామీల పేరు మీద ఎక్కువగా భూములు కొనడం సహజం. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులంతా భూముల కొనుగోలుకు దూరంగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఎన్నికల్లో ఖర్చు భారీగా అయిందన్న కారణంగా ఇప్పటికీ రాజకీయ నాయకులు క్రయాలపై దృష్టి పెట్టడం లేదు. దీనికి తోడు ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు సైతం రియల్‌ రంగంపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ శ్రేణి నాయకులు ఎక్కువగా జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతరత్రా నామినేటెడ్‌ పదవుల కోసం ఆశిస్తుంటారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల వచ్చే అవకాశం ఉండడంతో వారు సైతం భూముల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే రాజకీయ నాయకుడికి నగదు అతి ప్రధానం. దీంతో ప్రస్తుతం భూముల కొనుగోలు అంశాన్ని పక్కనపెట్టి నగదును సేకరించుకునే పనిలో ఉంటారు. ఇప్పుడు భూములు కొంటే తీరా ఎన్నికల నాటికి బిజినెస్‌ పడిపోయి ధరలు ఉండకపోతే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎగబాకి.. అంతలోనే పడిపోయి..

గడిచిన పదేళ్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పదేళ్ల కిందటితో పోలిస్తే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. 2014 తర్వాత రియల్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. గతంలో రూ.10లక్షలకు ఎకరం ధర పలికిన భూమి ప్రస్తుతం రూ. ఒక కోటి వరకు వెళ్లింది. అదే విధంగా రూ.2000 గజం స్థలం దొరగ్గా ప్రస్తుతం రూ. 20వేలకు ఎగబాకింది. జనగామ జిల్లాలో జిల్లా ఆవిర్భావం తర్వాత రియల్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. కాగా.. ఏడాదిన్నర నుంచి నెమ్మదిగా కుదేలవడం ప్రారంభమైంది. ప్రస్తుతం బిజినెస్‌ డల్‌గా మారడంతో రూ. కోట్లు వెచ్చించి వెంచర్లు చేసిన వారు, భూములు కొని పెట్టుకున్న వారికి వడ్డీలు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారం అంతంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాలు వెలవెల బోతున్నాయి. జిల్లాలో 12 తహసీల్దార్‌ కార్యాలయాలు, జనగామ, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. కాగా.. వీటిలో ఏడాదిన్నరగా రిజిస్ట్రేషన్లు తక్కువగానే జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జనగామ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గతంలో రోజుకు 75 నుంచి 100 రిజిస్ట్రేషన్లు జరగగా ప్రస్తుతం రోజుకు 30 కూడా జరగడం లేదు. ఈ 30 రిజిస్ట్రేషన్లలోనూ క్రయ, విక్రయాలకు సంబంధించినవి ఐదారు డాక్యుమెంట్లు కూడా ఉండడం లేదని రిజిస్ట్రేషన్‌ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందగించడంతో ప్రభుత్వ ఆదాయంపై కూడా ప్రభావం పడింది. ప్రభుత్వ ఖజానాకు ఏడాదిన్నర నుంచి అంతంతగానే ఆదాయం జమ అవుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భూములు, ప్లాట్లు అమ్మేవారు తప్ప కొనేవారు ఎవరూ లేకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లంతా కొనేవారిని(పార్టీలను) పట్టుకొని పనిలో నిమగ్నమయ్యారు. కొనే వారు, అమ్మేవారు కాకుండా మధ్యవర్తిత్వం చేసి కమీషన్లు తీసుకునే వారు చాలా మంది ఉం టారు. అలాంటి వారికి రియల్‌ ఎస్టేట్‌ రంగమే జీవనాధారం. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం పడి పోవడంతో అలాంటి వారికి కమీషన్లు రావడం కూడా ఆగిపోయాయి. దీంతో వారు పొద్దున లేవగానే పార్టీ లను వెతికే పనిలో నిమగ్నమవుతున్నారు. ఫలానా దగ్గర వ్యవసాయ భూమి ఉంది, ఫలానా దగ్గర ప్లాట్‌ ఉంది అంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తుండడం గమనార్హం. తమకు గతంలో ఉన్న పరి చయాల ద్వారా కొనడానికి ఆస్కారం ఉన్న రాజకీయ నాయకులు, డబ్బున్న వ్యక్తులకు కాల్స్‌ చేస్తూ వారి ని కొనేలా ఒప్పించే పనిలో ఉంటున్నారు. తక్కువలో వస్తుందంటూ, అంత మంచి భూమి మళ్లీ దొరకదంటూ కబుర్లు చెబుతూ కొనేవారికి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లిళ్ల కోస మో, ఆసుపత్రుల ఖర్చుల కోసమో, ఇంటి నిర్మాణం కోసమో భూమి గానీ, ప్లాట్‌ గానీ అమ్ముకుందామనుకుంటున్న వారికి ప్రస్తుతం చుక్కెదురు అవుతోంది. కొనేవారు ఎక్కువగా లేకపోవడంతో ముందుకొచ్చిన వ్యక్తికి ఎంతోకొంత గిట్టుబాటు చూసుకొని ఇవ్వాల్సి వస్తోంది.

Updated Date - Dec 12 , 2024 | 11:54 PM