Share News

ఎన్జీవో దరికి ‘సఖి’

ABN , Publish Date - Dec 12 , 2024 | 11:59 PM

సఖి సెంటర్లకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్వహణ సరిగా లేని కేంద్రాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా భూపాలపల్లిలోని సఖి సెంటర్‌ను మళ్లీ స్వచ్ఛంద సంస్థలకే అప్పజెప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటీఫికేషన్‌ జారీ చేసింది.

ఎన్జీవో దరికి ‘సఖి’
భూపాలపల్లి సుభాష్‌కాలనీలోని సఖి సెంటర్‌

రెండేళ్లుగా సంక్షేమ శాఖ ఆధీనంలో సఖి కేంద్రం

మళ్లీ స్వచ్ఛంద సంస్థకు సెంటర్‌ అప్పగింత

ఎట్టకేలకు మళ్లీ ఎన్జీవోకే బాధ్యతలు

నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

సెంటర్‌ను దక్కించుకొనేందుకు జోరుగా పైరవీలు

భూపాలపల్లి కృష్ణకాలనీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సఖి సెంటర్లకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్వహణ సరిగా లేని కేంద్రాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా భూపాలపల్లిలోని సఖి సెంటర్‌ను మళ్లీ స్వచ్ఛంద సంస్థలకే అప్పజెప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటీఫికేషన్‌ జారీ చేసింది.

ముఖ్యోద్దేశం ఏమిటంటే...

మహిళల రక్షణ, సమాజంలో వారు ఎదుర్కొంటు న్న సమస్యలను పరిష్కరించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోసం సఖి సెంటర్లను ఏర్పాటు చేసింది. హింసకు గురైన మహిళలు, యువతులకు ఒకే చోట వైద్య, పోలీసు, న్యాయ సహాయం అందించడం, కౌన్సెలింగ్‌ ఇవ్వడం, అవసరమైతే తాత్కాలిక వసతి కల్పించడం సఖి సెంటర్ల ముఖ్యోద్దేశం. గృహహిం స, వరకట్న వేధింపులు, పని చేసే చోట వేధింపులు, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణా తదితర సమస్యలను ఎదుర్కొనే మహళలకు అండగా నిలవడం ఈ కేంద్రాల నిర్వాహకుల పని. మహిళలకు ఏ సమస్య వచ్చినా నేరుగా సమాచారం అందించి సహాయం పొందేందుకు టోల్‌ఫ్రీ నంబరు 181 ఉంటుంది. ఈ సెంటర్ల నిర్వహణ స్వచ్ఛంద సంస్థలకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.

భూపాలపల్లిలో నాలుగేళ్ల క్రితం ప్రారంభం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సఖి సెంటర్‌ను 2020లో ఏర్పాటు చేశారు. అప్పటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం రెండేళ్ల కాలపరిమితిపై ఈ సెంటర్‌ నిర్వహణను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. దీని కాలపరిమితి ముగిసిన తర్వాత మరో సంస్థ బాధ్యతలు చేపట్టిం ది. అయితే.. కొన్ని ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం ఈ సంస్థ నిర్వహణను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో దీని బాధ్యతను సంక్షేమ శాఖ చేపట్టింది. రెండేళ్ల నుంచి ఆ శాఖ ఆధీనంలోనే భూపాల పల్లి సఖి సెంటర్‌ నడు స్తోంది. అయితే... ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని మళ్లీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వ ర్యంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని స్వచ్ఛం ద సంస్థలను ఆహ్వానిస్తూ నోటిఫికే షన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో ఏడు స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వరంగ ల్‌కు చెందిన ఓరుగల్లు ఎన్‌జీవో, సహృదయ ట్రస్టు, కాటారానికి చెందిన సఖ్యత చారిటబుల్‌ ట్రస్టు, భూ పాలపల్లికి చెందిన కేఎస్‌ఆర్‌ ట్రస్టు, అమృత వర్షిణి, హెచ్‌ఎంఆర్డీఎస్‌, ఏకే ఫౌండేషన్‌ సంస్థలు అర్జీలు పెట్టుకున్నాయి. వీటిలో ఒక దానికి త్వరలోనే సఖి సెంటర్‌ నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు.

పైరవీల జోరు..

సఖి సెంటర్‌ నిర్వహణపై స్వచ్ఛంద సంస్థలు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఏడు దరఖాస్తుదారుల్లో ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యే చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నట్టు తెలిసింది. ఇలా పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే ఎంపిక ప్రక్రియలో ఆసల్యమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాత వారిలో టెన్షన్‌

సఖి సెంటర్‌ నిర్వహణ ఎన్జీవోకు అప్పగిస్తుం డటంతో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల్లో టెన్షన్‌ మొదలైంది. గతంలో వీరి నియామకంపై అసంతృ ప్తులు నెలకొన్నాయి. కొత్తగా ఎన్జీవో నియామకమైతే ఉద్యోగుల మార్పు చేర్పులకు ఆ స్వచ్ఛంద సంస్థకు అధికారం ఉంటుంది. దీంతో తమ పరిస్థితేమిటోననే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెంటర్‌లో ఒక అడ్మినిస్ర్టేటర్‌, ఒక కౌన్సిలర్‌, ఒక కేస్‌ వర్కర్‌, ఇద్దరు సెక్యూరిటీ, ఇద్దరు మల్టీపర్పస్‌ అటెండర్లు.. మొత్తం ఏడుగురు ఉద్యోగు లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఇలానే కొనసాగు తారా.. లేక వీరి స్థానంలో కొత్త వారిని నియమిస్తా రా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

ఖాళీ పోస్టుల భర్తీకి అవకాశం

భూపాలపల్లి సఖి కేంద్రంలో ప్రస్తుతం ఉద్యోగుల కొరత కూడా ఉంది. మొత్తం 13 మంది సిబ్బంది అవసరముండగా ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నా రు. ఈ క్రమంలో కొత్తగా ఎన్‌జీవో నియామకమైతే ఖాళీగా ఉన్న ఒక లీగల్‌ కౌన్సిలర్‌, ఒక కేస్‌ వర్కర్‌, రెండు ఏఎన్‌ఎంలు, ఒక ఆఫీసు అసిస్టెంట్‌, ఒక సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. అయితే.. గతంలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా ఎంపిక పరీక్ష నిర్వహించి నియామకాలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అవకతవకలకు, అనర్హులకు ఆస్కారం లేకుండా పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

త్వరలోనే ఎన్జీవోను ఎంపిక చేస్తాం

- చెన్నయ్య, సంక్షేమ శాఖ జిల్లా అధికారి (భూపాలపల్లి)

సఖి సెంటర్‌ నిర్వహణకు ఎన్జీవోను నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానించాం. ఏడు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలోనే ఎంపిక జరుగుతుంది. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు అప్పగిస్తాం.

Updated Date - Dec 12 , 2024 | 11:59 PM