సాదాబైనామాకు మోక్షం
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:34 AM
ఏళ్ల కిందట సాదా బైనామాల రూపంలో భూములు కొనుగోలు చేసి వాటిని అనుభవిస్తున్నా వారి వద్ద సరైన రికార్డులు లేని కారణంగా ప్రభుత్వం వారిని పట్టాదారు రైతుల కింద గుర్తించ లేదు. సంవత్సరం క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూభారతి బిల్లు-2024ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టడంతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలుగనున్నది.
పదేళ్ల నిరీక్షణకు పడనున్న తెర
జిల్లా వ్యాప్తంగా 33,305 దరఖాస్తులు
తెలంగాణ భూ భారతి బిల్లు-2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ శాఖ మంత్రి
అమలులోకి రానున్న ఆర్వోఆర్-24 చట్టం
భూ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం
ఆర్వోఆర్-24తో సాదాబైనామాల క్రమబద్ధీకరణ
రఘునాథపల్లి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఏళ్ల కిందట సాదా బైనామాల రూపంలో భూములు కొనుగోలు చేసి వాటిని అనుభవిస్తున్నా వారి వద్ద సరైన రికార్డులు లేని కారణంగా ప్రభుత్వం వారిని పట్టాదారు రైతుల కింద గుర్తించ లేదు. సంవత్సరం క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూభారతి బిల్లు-2024ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టడంతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలుగనున్నది. దీంతో సాదాబైనామా దరఖాస్తుదారుల్లో ఆనందం వెల్లువిరిసింది. ప్రభుత్వ నిర్ణయంతో కొత్త రెవెన్యూ చట్టం ఆర్వోఆర్-24 ప్రకారం గతంలో తెల్లకాగితంపై కొనుగోలు చేసిన భూములకు హక్కులు లభించనున్నాయి సాదాబైనామాల ద్వారా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి పట్టాలు అందక ఇబ్బంది పడుతున్న రైతుల కష్టాలు తొలగనున్నాయి. సాదా బైనామాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు గత ప్రభుత్వం మొండిచేయి చూపింది. ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో 33,305 మంది పైచిలుకు రైతులు సాదాబైనామా కోసం దరఖాస్తు చేసి పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. భూములు సాగు చేసుకుంటున్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేక ధరణిలో రికార్డులకెక్కపోవడంతో ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలు అందక రైతులు ఇప్పటివరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘ భూభారతి‘ పేరిట నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు బిల్లును అసెంబ్లీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ప్రతీ భూకమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన భూధార్ నంబర్‌ను కేటాయించనున్నారు.‘ భూభారతి‘ కొత్త పోర్టల్ ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణలో భాగంగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టి సాదాబైనామాలతో భూములను కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న రైతులందరికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులతో పాటు ఇతరత్రా సబ్సిడీ పథకాలు సాదాబైనామాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు అందే అవకాశం కలుగుతుంది. 2014 జూన్ 2 లోపు సాదాబైనామాల ద్వారా భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకోలేని వారి భూములను ఆర్వోఆర్ చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలను జారీ చేసేందుకు గత ప్రభుత్వం 2020 అక్టోబరు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత నవంబరు 10వ తేదీ వరకు పొడిగించింది. మ్యాన్‌వల్‌గా కాకుండా మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 33,305 దరఖాస్తులు వచ్చాయి. 2020 అక్టోబరు 24న గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకురాగా, నవంబరు 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
అందకుండా పోయిన ప్రభుత్వ ప్రయోజనాలు
సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి భూము లపై హక్కులను కల్పిస్తూ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయాల్సిన గత ప్రభుత్వం కోర్టులో కేసు కారణంగా పెండింగ్‌లో పెట్టింది. కోర్టులో దాఖలై న పిటిషన్‌కు గత ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేయ ని కారణంగానే జాప్యం దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. దర ఖాస్తులన్ని తహసీ ల్దార్ కార్యాలయా ల్లోనే ఉండిపోయాయి. ఆ దరఖాస్తులను పరిశీలిం చ ని కారణంగా రైతులు గత ప్రభుత్వం అందించిన రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథ కాల ద్వారా అందే సాయాన్ని కోల్పోవడంతో పాటు రైతుభీమాకు నోచుకోకుండా పోయారు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణాలతో పాటు ఇత రత్రా రుణాలను పొందలేక పోయారు.
ఆర్వోఆర్-24తో పెరగనున్న పారదర్శకత
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఆర్వో ఆర్-24 రెవెన్యూ చట్టం ప్రకారం రెవెన్యూ సేవలలో మరింత పారదర్శకత పెరుగనున్నది. ఈ కొత్త చట్టంతో కలెక్టర్‌తో నిమిత్తం లేకుండా తహసీల్దార్లు, ఆర్డీవోలకే బదలాయుంపులు కేటాయించనున్నారు. ముఖ్యంగా మ్యుటేషన్, చట్టబద్ద హక్కుల నమోదు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, భూ రికార్డుల సవరణ, సాదాబైనామా, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ దరఖాస్తులకు సంబంధించిన అంశాలను ఆర్డీవోలకు అప్పగించనుండగా, విరాసత్‌తో పాటు మరికొన్ని అంశాలను తహసీల్దార్లకు అప్పగించనున్నారు. ఇప్పటీ వరకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్న సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉండగా, ప్రస్తుతం తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే సమస్యల పరిష్కారం చేసుకునే అవకాశం కలుగనుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం : గొరిగె సోమయ్య, కోడూరు
కాస్తులో ఉన్నప్పటీకి పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడంతో ప్రభుత్వం నుంచి లబించే ప్రయోజనాలు మాకు అందకుండా పోయాయి. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభాపరిణామం. మా పదేళ్ల నిరీక్షణకు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ’ భూభారతి ‘ బిల్లు ద్వారా తెరపడడం చాలా సంతోషకరమైన విషయం.
దరఖాస్తు చేసుకున్న వారందరికీ చేకూరనున్న ప్రయోజనం : పిన్నింటి మల్లయ్య, దాసన్నగూడెం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాదాబైనామాలో దరఖాస్తు చేసుకున్న రైతులందరికి ప్రయోజనం చేకూరనుంది. పదేళ్ల నుంచి భూములను కాస్తు చేసుకుంటున్నప్పటికీ పట్టాదారు పాస్ పుస్తుకాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలు అందలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందని ద్రాక్షగా ఉన్న ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలు సాదాబైనామా దరఖాస్తుదారులకు అందుబాటులోకి రావడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది.