ఆఫ్‌లైనలో ఇసుక దందా
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:13 AM
వేములపల్లి మండలంలోని రావులపెంట, ఆమనగల్లు, కామేపల్లి, లక్ష్మీదేవిగూడెం గ్రామ సరిహద్దుల గుండా ప్రవహిస్తున్న పాలేరు, మూసీ వాగు ఇసుక అక్రమ రవాణాదారులకు ఆదాయమార్గంగా మారింది.
ఆఫ్‌లైనలో ఇసుక దందా
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
పగలంతా డంపింగ్
రాత్రి వేళల్లో తరలింపు
పంచాయతీ ఆదాయానికి గండి
సామాన్యులకు ఇసుక దొరకని దుస్థితి
వేములపల్లి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): వేములపల్లి మండలంలోని రావులపెంట, ఆమనగల్లు, కామేపల్లి, లక్ష్మీదేవిగూడెం గ్రామ సరిహద్దుల గుండా ప్రవహిస్తున్న పాలేరు, మూసీ వాగు ఇసుక అక్రమ రవాణాదారులకు ఆదాయమార్గంగా మారింది. ఈ రెండు వాగులు మిర్యాలగూడ పట్టణంతో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండటంతో ఇసుకకు భారీగా డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు ఆనలైన విధానంలో గిట్టుబాటు కావడం లేదని ఆఫ్‌లైన విధానంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామపంచాయతీలకు అందాల్సిన ఆదాయం అందకుండా పోతుంది. సమీప గ్రామాల్లో పేద, మధ్య తరగతి ప్రజలు తమ గృహ నిర్మాణాల కోసం ఇసుక రవాణాకు నానాఅగచాట్లు పడాల్సి వస్తుంది. కానీ రోజు పదుల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు సమన్వయ లోపంతో తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేసేవారు లేకుండాపోయారు. ఇదే అదనుగా భావించిన ఇసుక దళారులు యథేచ్ఛగా రాత్రి, పగలు అన్న తేడాను లేకుండా ఇసుకను జోరుగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రధానంగా మండలంలోని రావులపెంట, కామేపల్లి, ఆమనగల్లు కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఆమనగల్లు నుంచి ఒక కిలోమీటర్ దూరంలో సూర్యాపేట జిల్లా సరిహద్దు ఉండటంతో పోలీసులు సమాచారం అందినా అక్కడికి వెళ్లేలోపు సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించడంతో వారిని ఏమి చేసే పరిస్థితి లేకుండా పోతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇక్క డ ఏ విధమైన చెక్‌పోస్టు లేకపోవడం అక్రమదారులకు అ నుకూలంగా మారింది. మరోవైపు కామేపల్లి వేములపల్లి మండల కేంద్రానికి సుదూరంలో ఉండటంతో పాటు పక్కనే మిర్యాలగూడ మండల సరిహద్దు కావడంతో అక్కడ సైతం ఇసుక అక్రమ రవాణాదారులకు అదునుగా మారింది. దీంతో జోరుగా ఇసుక రవాణా సాగుతుంది. అయినా సంబంధిత అధికారులు ఇక్కడ ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం ఇసుక అక్రమ రవానా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది.
పగలంతా డంపింగ్
మండలంలోని పాలేరు, మూసీ వాగుల సమీప గ్రామాలైన రావులపెంట, కామేపల్లి, ఆమనగల్లు, లక్ష్మీదేవిగూడెం గ్రామాల్లోని ఇసుక దళారులు పగటి వేళల్లో యథేచ్ఛగా ఇసుకను తరలించి తమ ఇంటి, దొడ్ల వద్ద భారీగా డంపింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటి వద్ద ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్నా వాటిని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాగుల్లో ప్రతి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న విషయాన్ని ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాక ఆ సమాచారాన్ని ఇసుక అక్రమ రవాణాదారులకు తెలియచేయడంతో సమాచారం ఇచ్చిన వారిపై భౌతిక దాడులు పాల్పడుతున్నారు. అయినా గ్రామాల్లో వెలుస్తున్న అక్రమ డంపింగ్‌లను సీజ్ చేయడంలో మాత్రం రెవెన్యూ, పోలీసు అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
ఆనలైనలో నిల్ - ఆఫ్‌లైనలో ఫుల్
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు 2019లో మండలంలోని రావులపెంట గ్రామపంచాయతీలో ప్రభుత్వ రీచను ఏర్పాటు చేసి ఆనలైన విధానంలో ఇసుక రవాణాకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2019 ఫిబ్రవరిలో రీచను ఏర్పాటు చేసి మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఆనలైనలో నమోదు చేసుకున్న వారికి ఇసుక రవాణాకు శ్రీకారం చుట్టారు. తద్వారా ఒక్కొక్క ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున రావులపెంట గ్రామానికి 2019లో రూ.15 లక్షలు, 2020లో రూ.11 లక్షలు, 2021లో రూ.11 లక్షల మేర ఆదాయం సైతం సమకూరింది. కానీ ఆనలైన విధానంలో ఇసుక సరఫరా చేయడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని ట్రాక్టర్ యజమానులు ఆనలైన విధానానికి స్వస్తి పలుకుతూ వచ్చారు. ఆఫ్‌లైనలోనే ఇసుక అక్రమ రవాణాకు తెరతీశారు. దీంతో రెండు సంవత్సరాలుగా ఆనలైనలో సరైన ఇసుక రవాణాల లేక గ్రామపంచాయతీ ఆదాయానికి గండి పడటంతో గ్రామాభివృద్ధి కొంతమేరర కుంటుపడిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అయినా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంలో అంటిముట్టనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తుంది.
ఇసుక అక్రమ రవాణా చేస్తే వాల్టా కేసు
మండలంలోని పాలేరు, మూ సీ వాగుల నుంచి ఎవరైనా ప్ర భుత్వ అనుమతి లేకుండా ఇసు క అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై వాల్టా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ అక్రమ రవా ణా జరగకుండా చూస్తున్నాం. వాగుల సమీపంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహించి ఇసుక రవాణాకు పాల్పడుతు న్న ట్రాక్టర్లను పట్టుకొని స్టేషనకు తరలించి కేసులు నమోదు చేస్తాం.
డి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ, వేములపల్లి