సంజయ్ యూత్ ఐకాన్
ABN , Publish Date - May 07 , 2024 | 05:55 AM
బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ యూత్ ఐకాన్ అని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ప్రశంసించారు. ప్రధాని మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సంజయ్ పోరాటాలు ఆదర్శంగా నిలిచాయని,
మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం.. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. రిజర్వేషన్లను రద్దు చేయబోం
బ్యాలెట్‌లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే కాంగ్రెస్‌కు ఓటేయండి: బండి సంజయ్
జమ్మికుంట, మే 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ యూత్ ఐకాన్ అని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ప్రశంసించారు. ప్రధాని మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సంజయ్ పోరాటాలు ఆదర్శంగా నిలిచాయని, ఆయన స్ఫూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేశానని తెలిపారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసి.. లాఠీ దెబ్బలు, కేసులకు భయపడకుండా ప్రజల కోసం జైలుకెళ్లిన చరిత్ర బండి సంజయ్‌దని ప్రశంసించారు. సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని జమ్మికుంటలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి అన్నామలై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత ఆలోచనలకు అనుగుణంగా సంజయ్ స్పందిస్తున్నారని, వారికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తున్నారని అన్నారు. కుటుంబ పాలనకు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై ఎలుగెత్తుతున్న పోరాటయోధుడని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఉద్యమించినందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంజయ్‌ని అవమానించిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆయన్ను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో తానూ పాల్గొన్నానని, మండే ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్న తీరు అభినందనీయమని ప్రశంసించారు. సంజయ్ పాదయాత్రను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని మోదీ తమకు పిలుపునిచ్చారని చెప్పారు. బీఆర్‌ఎస్ అవినీతిపై పోరాటం చేసినందుకు ఆయన్ను నాటి ప్రభుత్వం అనేకసార్లు జైలుకు పంపిందని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించిన జాతీయ నాయకత్వం, జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. దక్షిణ భారతాన పార్టీని ఆయన మరింత బలోపేతం చేస్తారన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. సంజయ్ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చారని తెలిపారు. కరీంనగర్ ప్రజలు ఆయనకు చరిత్రాత్మక విజయాన్ని అందిస్తారన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు సంజయ్‌కి పడేలా ఇంటింటికీ తిరిగి గెలిపించాలని యువతను కోరారు.
రిజర్వేషన్లకు మోదీ అనుకూలం: సంజయ్
తాము పువ్వు గుర్తుకు ఓటేయాలని తిరుగుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గాడిద గుడ్డు గుర్తు పట్టుకుని తిరుగుతున్నాడని.. కాబట్టి కాంగ్రె్‌సకు ఓటేయాలనుకునే వాళ్లు బ్యాలెట్‌లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే ఓటేయాలని బండి సంజయ్ చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500, రైతు భరోసా కింద రూ.15వేలు, స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులను జనం తిడుతున్నారని.. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు రేవంత్‌రెడ్డి గాడిద గుడ్డు గుర్తు ఎత్తుకున్నారని విమర్శించారు. భారతదేశ సింగమలై.. మన అన్నామలై.. అని ప్రశంసించారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తున్న నేత అని కొనియాడారు. కాగా, రిజర్వేషన్లు రద్దు చేయబోమని బీజేపీ కార్యకర్తలతో సంజయ్ ప్రమాణం చేయించారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న వారిని చెప్పులు, చీపుర్లతో తరిమి కొట్టాలని అన్నారు. ప్రధాని మోదీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు.