పౌరసరఫరాల శాఖకు ‘స్కోచ్’ అవార్డు
ABN , Publish Date - Dec 04 , 2024 | 05:59 AM
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలశాఖకు 2024 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మకమైన ‘స్కోచ్’ అవార్డు రావటం అభినందనీయమని ఆ శాఖ మంత్రి
ఏడాదిలో శాఖ పనితీరులో అద్భుతమైన పురోగతి
కమిషనర్ చౌహాన్‌ను అభినందించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలశాఖకు 2024 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మకమైన ‘స్కోచ్’ అవార్డు రావటం అభినందనీయమని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. వినూత్న ఆలోచనలతో వాతావరణ సమాచార పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పంట ఉత్పత్తులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నందుకుగాను ఈ అవార్డు లభించినట్లు తెలిపారు. ఏడాదిలో పౌరసరఫరాలశాఖ పనితీరులో అద్భుతమైన పురోగతిని సాధించినట్లు తెలిపారు. మంగళవారం పౌరసరఫరాల భవన్‌లో సమీక్ష నిర్వహించడానికి వచ్చిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేతులమీదుగా డీఎస్ చౌహాన్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ డీఎస్ చౌహాన్, డైరెక్టర్ ప్రసాద్‌ను మంత్రి అభినందించారు. సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పుడు పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పు రూ.4,747 కోట్లు ఉంటే.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 58,623 కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రూ.11,608 కోట్ల అప్పు తీర్చిందని పేర్కొన్నారు.