సచివాలయ ఉద్యోగులకు ‘ముఖ గుర్తింపు’ హాజరు
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:39 AM
సచివాలయ ఉద్యోగులకు ఇకమీదట ‘ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్)’ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ
ప్రతి అంతస్తులోని లిఫ్టు వద్ద ఏర్పాటు
సచివాలయ ఉద్యోగులకు ఇకమీదట ‘ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్)’ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ వర్తింపజేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 22 నుంచి ఉద్యోగుల రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. అధికారులు, ఉద్యోగుల హాజరు శాతాన్ని నిక్కచ్చిగా అంచనా వేయడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం సచివాలయంలోని అన్ని శాఖలు, విభాగాల్లో రిజిస్టర్లలో సంతకాలు చేసే మాన్యువల్ విధానం కొనసాగుతోంది. దీని స్థానంలో ‘ముఖ గుర్తింపు’ హాజరు విధానాన్ని ఆచరణలో పెట్టాలని నిర్ణయించింది. సచివాలయంలో ప్రస్తుతం నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి ఏఎ్‌సఓలు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీల వరకు దాదాపు 4వేల మంది పని చేస్తున్నారు. ఐఏఎ్‌సలు మినహా అందరికీ ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. వీరికి రిజిస్ట్రేషన్లను ఈ నెల 22 న ప్రారంభించనున్నట్లు సీఎస్ తెలిపారు.