కేసీఆర్‌ను చూస్తే జాలేస్తోంది
ABN , Publish Date - Apr 03 , 2024 | 06:28 AM
బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయినందుకు, కవిత జైలుకు పోయినందుకు కేసీఆర్‌ను చూస్తుంటే జాలేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ
అధికారం పోయింది, కూతురు జైలుకు పోయింది
ఎన్నికలు ఉన్నందునే రైతులపై కపట ప్రేమ..
లేకపోతే బయటకు వచ్చే వారే కాదు
మీ పాపాలకు భయపడే నాడు వరుణుడు పారిపోయాడు..
అందుకే కరువు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు..
కానీ, మేం కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు చేశాం
జూన్ 9న ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం
తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
సీఎం రేవంత్ వెల్లడి.. సభ ఏర్పాట్ల పరిశీలన
రంగారెడ్డి అర్బన్, మహేశ్వరం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయినందుకు, కవిత జైలుకు పోయినందుకు కేసీఆర్‌ను చూస్తుంటే జాలేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసమే కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతూ నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారని విమర్శించారు. పొగ పెట్టగానే కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు... ఎన్నికలు అనే పొగ పెట్టడంతో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చాడని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న భారీ ఎత్తున నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగసభ ఏర్పాట్లను, ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించి నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘కేసీఆర్ పొలం బాట పట్టడం సంతోషం. పదేళ్ల తర్వాత తెలంగాణ రైతులు గుర్తొచ్చినందుకు సంతోషం. అధికారం పోకుండా ఉండి ఉంటే.. కిందపడి గాయం కాకుండా ఉంటే.. కూతురు జైలుకు వెళ్లకపోయి ఉంటే ఆయన ఎవరికీ దొరికే వారు కాదు. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని కేసీఆర్ అంటుండు.. మేం అధికారంలోకి వచ్చిందే చలికాలంలో... వర్షాకాలంలో అధికారంలో ఉన్నది వాళ్లే.. కేసీఆర్ పాపాలకు వరుణ దేవుడు కూడా భయపడి అప్పట్లో పారిపోయాడు’ అని రేవంత్ పేర్కొన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో, వానకాలం ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాపాలతోనే కరువు పరిస్థితులు వచ్చాయని, ఆయన చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూసి కేసీఆర్ నిప్పులు పోసుకుంటున్నారు. ఆయన పర్యటన చూస్తోంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది. ఆయన పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది’ అని సీఎం చెప్పారు.
30 సెకన్లు కూడా కరెంటు పోలేదు
కేసీఆర్ మొన్నటి పర్యటనలో జనరేటర్‌తో ప్రెస్‌మీట్ పెట్టి, కరెంటు పోయిందని తమ ప్రభుత్వంపై నిందలు వేశారని.. వాస్తవానికి, కేసీఆర్ పర్యటించిన రోజు సూర్యాపేటలో 30 సెకన్లు కూడా కరెంట్ పోలేదని సీఎం తెలిపారు. ‘మీ జనరేటర్‌లో ఎవడు పుల్ల పెట్టిండో ఎవరికి తెలుసు? ఆ నింద మా మీద ఎందుకు వేస్తావు’ అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తాము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే తమను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని.. కానీ ఇప్పుడు తాము అలా వ్యవహరించలేదని, కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాము తలుచుకుంటే కేసీఆర్ బయటకు వెళ్లేవారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని.. రైతులకు రూ.100 కోట్లు సహాయం చేయొచ్చు కదా అని సూచించారు. ప్రతి వారం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత నెరవేర్చాలని.. న్యాయమైన సలహాలు, సూచనలు ఇస్తే అమలు చేస్తామని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డీ! ఎక్కడ నిద్రపోతున్నావని కేసీఆర్ అంటున్నారు. నేను ఫామ్‌హౌ్‌సలోనో, సినిమా వాళ్ల గెస్ట్‌హౌ్‌సలలోనో పడుకోవడం లేదు’ అంటూ సీఎం ఎద్దేవా చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధును వేయడానికి 10 నెలల సమయం తీసుకున్నదని, తాము ఇప్పటికే 65 లక్షల రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేశామని.. మిగిలింది 4 లక్షల రైతులేనని.. ఎన్నికలు అయిపోగానే వీరికి కూడా అందజేస్తామని సీఎం తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామన్నారు. తాము చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్‌కు 24 గంటల సమయం ఇస్తున్నానని.. ఆ లోగా వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే ఆయా రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ చెల్లని వెయ్యి నోటు
తాము ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ తెలంగాణ హక్కులు సాధిస్తున్నామని.. అందుకే అక్కడకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. కేసీఆర్ పాపాల వల్లే బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు పారిపోతున్నారని, పార్టీ నేతలను కాపాడుకోవడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ చెల్లని వెయ్యి రూపాయల నోటని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని... ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీశాయని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు రాష్ట్రంలో అమలయ్యేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని, నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్‌కు కంచుకోట తెలంగాణ
కాంగ్రె్‌సకు తెలంగాణ కంచుకోట అని నిరూపిస్తామని రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకమైనదని, సోనియమ్మ కుటుంబంతో రాష్ట్రానికి ఉన్న అనుబంధం మరింత ప్రత్యేకమైనదన్నారు. సోనియమ్మపై అభిమానంతోనే ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన సభలో సోనియమ్మ ఆరు గ్యారంటీలను విడుదల చేశారని, వాటిని స్వల్పకాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఎన్నికల కోడ్ ముగియగానే హామీలన్నింటినీ వందశాతం అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇదే వేదికగా తుక్కుగూడ సభలో జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుందని, 5 గ్యారంటీలను ప్రకటించనుందని తెలిపారు. జాతీయ కార్యాచరణకు ఇక్కడి నుంచి పిలుపునివ్వడం అంటే తెలంగాణ కార్యకర్తల కష్టాన్ని అధిష్ఠానం గుర్తించించినట్లేనని పేర్కొన్నారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు రాష్ట్రం నలుమూలల నుంచి జనజాతర సభకు తరలి రావాలని, ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదించాలన్నారు. సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే... రాష్ట్రానికి జరిగే మేలును ఈ సభ ద్వారా తెలియజేస్తామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రానుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీన ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రానుందని, డిసెంబరు 9న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుందని ప్రకటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన చెప్పినట్లుగానే జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో కేంద్ర సర్కార్ తమదే అంటూ రేవంత్‌రెడ్డి తేదీని కూడా ప్రకటించటంపై ఆసక్తి నెలకొంది.