Share News

సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:05 AM

సింగరేణి సీఎండీ పోస్టు కోసం పలువురు కీలక ఐఏఎ్‌సలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

పోస్టు కోసం పలువురు ఐఏఎ్‌సల పోటీ

ముగియనున్న ఇన్‌చార్జి సీఎండీ బలరామ్‌ డిప్యుటేషన్‌

డిప్యుటేషన్‌ను పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం విముఖం

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సీఎండీ పోస్టు కోసం పలువురు కీలక ఐఏఎ్‌సలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్‌.బలరామ్‌ కేంద్ర సర్వీసులకు చెందిన అధికారి. రాష్ట్రంలో ఆయన డిప్యూటేషన్‌ కాలం ముగిసిపోవస్తోంది. డిప్యూటేషన్‌ను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే వార్తలు రావడంతో ఆ పోస్టును దక్కించుకోవడానికి పలువురు కీలక ఐఏఎ్‌సలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శైల జా రామయ్యర్‌ ముందు వరుసలో ఉన్నారు. 1997 బ్యాచ్‌కు చెందిన ఆమె సీఎండీ పోస్టును కోరుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె చేనేత శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈమెకు కోల్‌బెల్ట్‌పై పూర్తి స్థాయిలో పట్టుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సతీమణి కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యధికకాలం ఎన్‌.శ్రీధర్‌ సీఎండీగా ఉన్నారు.

9 ఏళ్లకు పైగా ఆయన సీఎండీ పోస్టులో కొనసాగారు. పలు సందర్భాల్లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా సింగరేణి పాలక మండలి సమావేశంలో ఆయన పదవీ కాలం పొడిగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీధర్‌ను కొనసాగించింది. గత ప్రభుత్వంలోని కీలక పెద్దలకు ఆప్తుడిగా శ్రీధర్‌కు పేరుండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చీ రాగానే శ్రీధర్‌ను తప్పించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. తాజాగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. శ్రీధర్‌ను తప్పించిన నాటి నుంచి ఎన్‌.బలరామ్‌ ఇన్‌చార్జి సీఎండీగా ఉన్నారు. ఆర్థిక రంగంపై బలరామ్‌కు బలమైన పట్టు ఉంది. సింగరేణి ఆర్థిక పరపతి పెంచడంలోనూ ఆయన పాత్ర కీలకమని అధికారులు చెబుతుంటారు. నిధుల సమీకరణలోనూ బలరామ్‌ దిట్ట. రాష్ట్రంలోని మరే కార్పొరేట్‌ కంపెనీలో లేని విధంగా సింగరేణి కార్మికులకు రూ.కోటి బీమాను బ్యాంకుల నుంచి వర్తింపచేయడంలో బలరామ్‌దే కీలక పాత్ర. దాంతో కొత్త సీఎండీగా ఐఏఎ్‌సలకు అవకాశం ఇస్తారా? లేక కేంద్రాన్ని ఒప్పించైనా బలరామ్‌ను కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది.

Updated Date - Dec 11 , 2024 | 05:05 AM