Share News

సిరిసిల్ల ఫస్ట్‌.. జహీరాబాద్‌ లాస్ట్‌!

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:20 AM

ఆస్తి పన్ను వసూళ్లలో సిరిసిల్ల మునిసిపాలిటీ మొదటి స్థానంలో నిలవగా, జహీరాబాద్‌ మునిసిపాలిటీ చివరి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పట్టణ స్థానిక సంస్థల నుంచి

సిరిసిల్ల ఫస్ట్‌.. జహీరాబాద్‌ లాస్ట్‌!

పట్టణాల్లో 922కోట్ల ఆస్తి పన్ను వసూలు

2023-24కు లక్ష్యం రూ.1300 కోట్లు

70.92% వసూలు చేసిన అధికారులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను వసూళ్లలో సిరిసిల్ల మునిసిపాలిటీ మొదటి స్థానంలో నిలవగా, జహీరాబాద్‌ మునిసిపాలిటీ చివరి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పట్టణ స్థానిక సంస్థల నుంచి ఆస్తి పన్ను కింద రూ.1300 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.922 కోట్లను అధికారులు వసూలు చేశారు. మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యంలో ఇది 70.92శాతం కావడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ పట్టణ స్థానిక సంస్థల నుంచి ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మార్చి నెల చివరి మూడు రోజులు గంట గంటకు ఎంత వసూలు చేశారనే ప్రాతిపదికన పర్యవేక్షించారు. మార్చి 31వ తేదీన ఒక్క రోజే రూ.28 కోట్లు వసూలు చేశారు. 2022-23 ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం రూ.115 కోట్ల అదనంగా వసూలు చేసినట్లు పురపాలక శాఖ సంచాలకురాలు దివ్య తెలిపారు. ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి తొలి పది స్థానాల్లో సిరిసిల్ల, ఇల్లందు, హుజురాబాద్‌, ఐజా, దేవరకొండ, నర్సాపూర్‌, జమ్మికుంట, వాడపల్లి, పెద్దపల్లి, కోరుట్ల ఉన్నాయి. సిరిసిల్ల పరిధిలో రూ.5.61 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటే.. రూ.5.58 కోట్లు(99.52 శాతం) వసూలు చేశారు. చివరి పది స్థానాల్లో నిలిచిన వాటిలో జహీరాబాద్‌, నల్లగొండ, నకిరేకల్‌, జాలపల్లి, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌, తాండూరు, బైంసా, ఖానాపూర్‌, చేర్యాల ఉన్నాయి. జహీరాబాద్‌లో రూ.16.70 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటే.. కేవలంరూ.5.81 కోట్లు ( 34.77 శాతం) వసూలు చేశారు. మొత్తం 140 పట్టణ స్థానిక సంస్థల నుంచి రూ.1300.07 కోట్ల ఆస్తి పన్నుకు గాను రూ.922.03 కోట్ల వసూలు చేయగా ఇంకా రూ.378.04 కోట్ల బకాయిలు ఉన్నాయి.

Updated Date - Apr 04 , 2024 | 05:20 AM