‘డీఎస్సీ-2008’ అభ్యర్థుల సమస్యను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:21 AM
రెండు, మూడు రోజుల్లో ‘డీఎస్సీ-2008’ అభ్యర్థుల సమస్యను పరిష్కరిస్తామని, జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి భరోసా
ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి భరోసా
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రెండు, మూడు రోజుల్లో ‘డీఎస్సీ-2008’ అభ్యర్థుల సమస్యను పరిష్కరిస్తామని, జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి భరోసా ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 200 మందికి పైగా ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు మంగళవారం ప్రజాభవన్‌కు తరలివచ్చి చిన్నారెడ్డితో తమ గోడును వెళ్లబోసుకున్నారు. 15ఏళ్లుగా ఎదురుచూస్తున్న తాము వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించి, నియామక పత్రాలను ఇస్తారని ఆశించామని, కానీ రెండు నెలలు గడుస్తున్నా ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోయారు. దీనికి స్పందించిన చిన్నారెడ్డి వెంటనే విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని చెప్పారు. తాను మరోసారి మాట్లాడి అతి త్వరలో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని అభ్యర్థులకు హామీ ఇచ్చారు.