TS News: విద్యార్థులకు గంజాయి విక్రయం.. ముఠా గుట్టు రట్టు
ABN , Publish Date - Mar 26 , 2024 | 04:52 PM
హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును ఎస్ఓటీ బృందం రట్టు చేసింది.
హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును ఎస్ఓటీ బృందం రట్టు చేసింది. రాజేంద్రనగర్‌లో ఇద్దరు స్మగ్లర్ల నుంచి 30 కేజీల గంజాయినీ స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్ఓటీ బృందం పేర్కొంది. పట్టుబడి గంజాయి విలువ రూ.11 లక్షలు ఉంటుందని తెలిపింది. గంజాయి స్మగ్లింగ్ జరుగుతోన్నట్లు తమకు సమాచారం అందడంతో.. ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించినట్లు వివరించింది.
గంజాయి స్మగ్లర్లు పాతబస్తీ వాసులు మహ్మద్ అయాన్, మహ్మద్ మొయినుద్దీన్‌తోపాటు ఒడిశాకు చెందిన దీపక్‌లని తెలిపింది. అయితే వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశామని.. దీపక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వీరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది. గంజాయిని బ్రౌన్ కలర్ ప్యాకెట్స్‌లో ప్యాకింగ్ చేసి.. ఆటోలో దాచి స్మగ్లర్లు స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొంది.
ఈ గంజాయిని భద్రాచలంలో దీపక్ కొనుగోలు చేసినట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఈ గంజాయినీ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి.. వాటిని విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తెలిందని తెలిపింది. స్మగర్లు తరలిస్తున్న ఆటోతోపాటు ఓ బైక్‌ను సైతం సీజ్ చేసినట్లు ఎస్ఓటీ పోలీసులు వివరించారు.