రాజన్న ఆలయానికి మహర్దశ వేములవాడకు 127 కోట్ల నిధులు
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:58 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రచార సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాజన్నను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి
నేడు దేవస్థానానికి సీఎం రేవంత్‌రెడ్డి
సిరిసిల్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రచార సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాజన్నను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రావడంతోనే బడ్జెట్‌లో రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. వేములవాడలో ఇతర అభివృద్ధి పనులు, ఆలయ విస్తరణకు రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం జీవోలు జారీ చేశారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడలో స్వామివారిని దర్శించుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే, రద్దీకి అనుగుణంగా ఆలయంఅభివృద్ధికి నోచుకోకపోవడం, భక్తులకు సరిపడా మౌలిక వసతులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తూ రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా.. అది ఆచరణకు నోచుకోలేదు. బీఆర్‌ఎస్ సర్కారు హామీలు కాగితాల మీద డిజైన్లుగానే మిగిలిపోయాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధి కోసం రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసింది.