బీఆర్‌ఎస్ కోసం స్పెషల్ టాస్క్!
ABN , Publish Date - Apr 02 , 2024 | 05:27 AM
‘‘మూడోసారి బీఆర్‌ఎ్‌సకు పట్టం కట్టించాలని ఎంతో కృషి చేశాం..! ప్రత్యర్థి పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. వారు డబ్బును తరలించే వివరాలను అందజేశారు. ఆ
గులాబీ గెలుపు కోసం ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్
ఒకే సామాజిక వర్గ అధికారులతో బృందాలు
నల్లగొండకు ప్రణీత్.. రాచకొండకు భుజంగరావు ఇన్‌చార్జి
తెరపైకి మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావు పేరు
సిగ్నల్, వాట్సాప్, స్నాప్‌చాట్‌లోనే సమాచార మార్పిడి
మార్గదర్శకుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు
ఆయన చెప్పినట్లుగా తస్మదీయుల డబ్బు పట్టివేత
అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్‌ఫోర్స్ వాహనాలు
ఫోన్ ట్యాపింగ్‌తో ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలపై దాడి
దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ బంధువు వద్ద కోటి
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి సొమ్ము 3.5 కోట్లు
2018లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి డబ్బు 70లక్షల సీజ్
బాల్య స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజ్‌పుష్ప నుంచి డబ్బు
తరలింపు.. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో వెల్లడి
బీఆర్‌ఎస్‌లోనూ అనుమానితుల ఫోన్ల ట్యాపింగ్
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ‘‘మూడోసారి బీఆర్‌ఎ్‌సకు పట్టం కట్టించాలని ఎంతో కృషి చేశాం..! ప్రత్యర్థి పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. వారు డబ్బును తరలించే వివరాలను అందజేశారు. ఆ లీడ్స్‌తో మేము దాడులు చేసి, నగదును సీజ్ చేశాం..! ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం. ఆయన మార్గదర్శనంలోనే ఒకే సామాజికవర్గానికి చెందిన పోలీసులతో ‘స్పెషల్ ఆపరేషన్’ చేపట్టాం. బీఆర్‌ఎ్‌సలో అనుమానిత నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశాం!’’.. ఇవీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులోని కీలకాంశాలు. పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీరు మొదలు.. బీఆర్‌ఎస్ కోసం పోలీసులు డబ్బును తరలించడం.. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నగదును సీజ్ చేయడం వరకు ప్రభాకర్‌రావు ‘స్పెషల్ ఆపరేషన్ టీమ్’ విధులను రాధాకిషన్ వివరించినట్లు రిమాండ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును ఇంటెలిజెన్స్ చీఫ్(ఓఎ్‌సడీ)గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్‌రావు పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ‘‘ప్రభాకర్‌రావు బాధ్యతలు చేపట్టాక.. ఒక క్రమ పద్ధతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను తన కోటరీ(ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్)లో నియమించుకున్నారు. రాధాకిషన్ 2017లో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత రెండుసార్లు ఆయన పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2023 ఆగస్టులోనూ మూడేళ్లపాటు ఆయన టాస్క్‌ఫోర్స్ డీసీపీగా కొనసాగేలా ఉత్తర్వులిచ్చింది. రాధాకిషన్‌కు ఈ గౌరవం దక్కడానికి ప్రభాకర్‌రావే కారణం. అంతేకాదు.. తన కోటరీలో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు, డీఎస్పీ ప్రణీత్‌రావును నియమించుకున్నారు. రాధాకిషన్‌కు అనుకూలంగా ఉండే గట్టుమల్లును టాస్క్‌ఫోర్స్ వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. రాధాకిషన్‌కు పరిచయం ఉన్న ఓ వ్యక్తిద్వారా ప్రణీత్‌రావును ఎస్‌ఐబీలో తీసుకున్నారు. ప్రణీత్‌రావు కోసం ఎస్‌ఐబీలో ‘స్పెషల్ ఆపరేషన్స్ టీమ్’ను ఏర్పాటు చేశారు. ప్రభాకర్‌రావు వద్ద ప్రణీత్‌రావు పనిచేసేవారు. ఫోన్ ట్యాపింగ్‌లో.. బెదిరింపుల్లో.. ఎన్నికల సమయంలో నగదు పట్టివేతలో వీరు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వీరిని ‘స్పెషల్ ఆపరేషన్ టీం’గా పేర్కొన్నారు. ఈ నలుగురిని వేర్వేరు జిల్లాలు/నగరాలు/కమిషనరేట్లకు ఇన్‌చార్జులుగా నియమించారు. అలా హైదరాబాద్ నగరంలో తిరుపతన్న, రాచకొండలో భుజంగరావు, సైబరాబాద్‌లో వేణుగోపాల్‌రావు, నల్లగొండలో ప్రణీత్‌రావు టీమ్‌లు పనిచేశాయి. ప్రభాకర్‌రావు నుంచి వచ్చే ఆదేశాల మేరకు వీరు తమ బృందాలతో దాడులు చేసి, ప్రత్యర్థి పార్టీల నేతలకు చెందిన నగదును సీజ్ చేశారు’’ అని దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. వీరంతా స్నాప్‌చాట్, సిగ్నల్ యాప్, వాట్సా్‌పలోనే సమాచారాన్ని అందిపుచ్చుకునేవారని వివరించారు. వీరి మధ్య ఫోన్‌కాల్స్ సిగ్నల్ యాప్‌లోనే జరిగేదని, ప్రభాకర్‌రావు కూడా తరచూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఫోన్ చేసేవారని రాధాకిషన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ప్రత్యర్థుల ఆర్థిక మూలాలపై దెబ్బ
బీఆర్‌ఎ్‌సకు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టేందుకు ప్రభాకర్‌రావు అహరహం శ్రమించేవారని, తమ టీమ్‌లలో ఎవరు ఆయనను కలిసినా.. బీఆర్‌ఎ్‌సను గెలిపించుకోవాలని చెప్పేవారని రాధాకిషన్ పేర్కొన్నట్లు రిమాండ్ రిపోర్టు చెబుతోంది. ‘‘2018 ఎన్నికల్లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్‌సాయికి చెందిన రూ.70 లక్షల నగదును సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద సీజ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్‌రావు(బీజేపీ) బంధువులకు చెందిన చిట్‌ఫండ్ కంపెనీలో రూ.కోటిని సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహచరుల నుంచి రూ.3.5కోట్ల నగదు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలోని గాంధీనగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌ల ద్వారానే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎ్‌సలో చేరేలా చేశారు. బీఆర్‌ఎ్‌సలోనూ అనుమానాస్పద నేతలు అనుకున్న వారి ఫోన్లను ట్యాప్ చేశారు’’ అని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
తమ వారి కోసం నగదు చేరవేత
ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నేతల కోసం పదుల సంఖ్యలో టాస్క్‌ఫోర్స్ వాహనాలను ఉపయోగించుకుని, నగదును వేర్వేరు ప్రాంతాలకు చేరవేసినట్లు రాధాకిషన్ ఒప్పుకొన్నట్లు పంజాగుట్ట పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ‘‘బీఆర్‌ఎ్‌సకు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్‌ఫోర్స్ ఎస్సై ఒకరు స్వయంగా డబ్బు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్‌కు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజ్‌పుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదును తరలించారు’’ అని ఆ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.
నా ఫోన్ ట్యాప్ చేశారు: కాంగ్రెస్ నేత
ఫోన్ ట్యాపింగ్‌పై సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ సీపీ శ్రీనివా్‌సరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు తన ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని, తనపై నిఘా పెట్టి, కుట్రపన్నారని భావిస్తున్నట్లు వివరించారు. సిరిసిల్ల వార్‌రూమ్ ద్వారా తనను ఓడించడానికి కుట్ర చేశారని ఆరోపించారు.
సూత్రధారి ఎవరు?
ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసులంతా.. ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అని వాంగ్మూలమిచ్చారు. ప్రభాకర్‌రావుతో ఫోన్‌ట్యాపింగ్‌లు చేయించిందెవరు? అనే ప్రశ్నకు మాత్రం దర్యాప్తు అధికారులు సమాధానాలను రాబట్టలేకపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావును విచారిస్తే తప్ప.. అసలు ‘బాస్’ ఎవరు అనేది తెలియదని స్పష్టమవుతోంది. ఆయన నోరు తెరిస్తే తప్ప.. ఈ కేసులో ఉన్న కీలక సూత్రధారులైన రాజకీయ నాయకులు ఎవరనేది తెలిసే అవకాశాలు లేవు. కాగా.. ఈ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పోలీసు కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. రాధాకిషన్ కస్టడీకి పంజాగుట్ట పోలీసులు వేసిన పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్టు న్యాయమూర్తి మంగళవారానికి రిజర్వ్ చేశారు.