Share News

Kaloji Narayana Rao: స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ సాధనలో.. కాళోజీ ఉద్యమ స్ఫూర్తి అనిర్వచనీయం

ABN , Publish Date - Sep 08 , 2024 | 08:58 AM

కాళోజీ నారాయణ రావు ‘ఇదీ నా గొడవ’ అనే పేరుతో తన ఆత్మకథ రాసుకున్నారు. స్నేహసాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం 1995 సెప్టెంబరు నెలలో విడుదల అయింది.

Kaloji Narayana Rao: స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ సాధనలో.. కాళోజీ ఉద్యమ స్ఫూర్తి అనిర్వచనీయం

  • నేడు ప్రజాకవి కాళోజీ జయంతి

‘‘బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలనేవాడు.’’ తెలంగాణ భాష ఆయనకు ఎంతో ఇష్టం. ఎవరి వాడుక భాషలో వాడు రాయాలని చెప్పేది ఆయన సిద్ధాంతం. రిక్షావోడితోనైనా, రాష్ట్రపతితోనైనా ఒకే రీతిలో సంభాషించేవాడు. ‘నా గొడవతో’ రాసిన కవిత్వమంతా ప్రజల గొడవే. అన్యాయం ఏ రూపంలో ఉన్న, ఎక్కడ ఉన్న ఎదిరించడమే ఆయన నైజం. ‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’’ అన్న గొప్ప వ్యక్తి. తన 90 ఏళ్ల జీవితంలో చెప్పిందే చేసిండు. చేసింది చెప్పిండు. అందుకే ఆయన విశ్వమానవుడు.

కాళోజి అనే మూడు అక్షరాలు తెలుగు సాహిత్యలోకాన్నే కాదు, యావత్ సమాజాన్ని ప్రభావితం చేశాయి. ఆయనది సామాన్య నిరాడంబర జీవితం. ఆయన సామాన్యుల్లో అసామాన్యుడు. తనకు గుర్తింపు కావాలని ఆయన ఏనాడు కోరుకోలేదు. రాజకీయాల్లో ఉంటే ఎన్నో పదవులు పొందెటోడు. అది ఊహాజనితమైన విషయం. అధికారం వైపు కన్నెత్తి చూసే లక్షణం ఆయనకు లేదు. అధికారం అంటే ఒత్తిళ్లు, దర్పం, అధికారం మిత్రుల మీద ఉపయోగించడం వంటివి ఉంటాయి. వాటికి ఆయన పూర్తి విరుద్ధం. కాళోజి ఒక ప్రవక్త, ఒక సూఫీ వేదాంతి, ఒక కబీర్.


కాళోజీకి మనిషన్న, బతుకడమన్న చాలా ఇష్టం. మనిషి మనిషిలా జీవిస్తే, ఇంకో మనిషిని మనిషిలా గౌరవిస్తే ప్రపంచం బాగుపడుతుందన్న ఆలోచన ఉన్నవాడు. ఆయన తపనంతా మనిషి కోసమే. ‘‘ఈశ్వరుడుని కచ్చితంగా నమ్ముతాను. నేను ఆచరించి తీరుతాను. జరిగిందానికి వగవను. జరిగేదానిని తలవను. జరగనున్నది అని ఊహాగానాలు చేయను. వర్తమానంలోనే బతుకుతాను’’ అంటారు కాళోజి. బతికినంత కాలం ఆత్మగౌరవంతో బతికిండు. అన్యాయాన్ని, పీడనని ఎదిరించి బతికిండు. నిజాంకి వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గొన్నడు. 1952లో హనుమకొండ పార్లమెంటుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత ఏ పార్టీ తరఫున పోటీ చేయలేదు. 1958–60 మధ్య రెండున్నర సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఉన్నాడు. 1977లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మీద పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే, కాళోజీ ధైర్యంగా పోటీ చేసి ఎదుర్కొన్నాడు.


స్వతంత్ర భారతంలోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ జైలుకు పోయాడు. తనకు నచ్చినట్లు బతికిండు. ఎమర్జెన్సీని ప్రశ్నిస్తూ కవితలు రాసిన ఏకైక వ్యక్తి కాళోజి. విశాలాంధ్ర కావాలని తొలుత కోరుకున్నా, తర్వాత తెలంగాణ సంస్కృతి భాష, యాస వేళాకోళానికి గురైతే బాధపడి, ప్రత్యేక తెలంగాణను సమర్ధించి పోరాటం చేశాడు. అతను ఒక మానవతావాది, వైతాళికుడు, ఒక ఓదార్పు, భరోసా కలిగించిన స్వచ్ఛమైన మనిషి.

నిత్య సత్యవాక్యాలు ఆయన కవిత్వంలో ఎన్నో ఉన్నాయి. ‘‘సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు’’, ‘‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ’’, ‘‘హెచ్చు తగ్గులున్న చోట చచ్చిపోవు సమభావం, సమభావం లేని చోట సామ్యవాదం అవుత’’ ఇలాంటి మాటలు ఎన్నో. అధికార దాహాన్ని, రాజ్యకాంక్షను, తన చేతికర్రతో అదిలిస్తూ, ప్రజల గొడవలన్నీ నా ‘గొడవల’ని చేతి సంచిలో వేసుకుని అన్యాయం ఎదిరిస్తూ, ప్రతి ఒక్కరి గుండెల్లో స్వేచ్ఛ పతాకాన్ని ఎగరేయాలని, పరితపించిన ప్రజాకవి కాళోజి. తన జీవనగీతం అనంత చరణాలతో నిరంతరం బడుగుల బతుకులు అభిషేకించిన వైతాళికుడు కాళోజి. ఆయన కవిత్వం అంతా ఆయన జీవిస్తున్న సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలకు, ఎప్పటికప్పుడు స్పందించి వేమన వలె చేసిన అభిప్రాయ ప్రకటనలే. ‘‘నేను కవిని కావాలని కవిత్వం రాయలేదు. ఆనందమో, విషాదమో కలిగినప్పుడు, నాకు తోచిన మాటలు రాసిన. అది విన్నవాళ్లకు నచ్చింది. అందులో కవిత్వం ఉన్నదని నేను అనలేదు. ఉన్నదని మీరంటే సంతోషమే’’ అనేవాడు. మనిషిని కేంద్రంగా చేసుకొని, బతుకులు ఆధారం చేసుకుని రాసిందే ఆయన కవిత్వమంతా. తన మరణానంతరం పార్థివదేహాన్ని వరంగల్ కాకతీయ వైద్యకళాశాల విద్యార్థుల ఉపయోగం కోసమే దానం చేసిన వ్యక్తి కాళోజి.

For Latest News click here

Updated Date - Sep 08 , 2024 | 09:06 AM