నన్ను దెబ్బతీసే కుట్రలు
ABN , Publish Date - Apr 09 , 2024 | 04:24 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పడదోసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వెనక నుంచి గూడుపుఠానీ జరుగుతోందని ఆరోపించారు. ఓట్ల కోసం
వెనక నుంచి కొందరు గూడుపుఠాణీ
కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ పన్నాగం
ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం
మోదీకి మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా
ఎక్కడ ఉన్నా నా గుండెచప్పుడు కొడంగలే
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: రేవంత్
కొడంగల్ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష
వెనక నుంచి కొందరు గూడుపుఠానీ చేస్తున్నారు..
కొడంగల్‌లో మెజారిటీ రాకుండా చేసి దెబ్బతీసే ప్రయత్నం: రేవంత్
కొడంగల్, ఏప్రిల్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పడదోసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వెనక నుంచి గూడుపుఠానీ జరుగుతోందని ఆరోపించారు. ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కాంగ్రె్‌సను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని తన నివాసంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మండలాల వారీగా లోక్‌సభ ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, పార్టీ పరిశీలకుడు సంపత్‌కుమార్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డితో కలిసి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సమీక్ష నిర్వహించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి సీఎం మాట్లాడుతూ.. కొడంగల్‌లో కాంగ్రె్‌సకు మెజారిటీ రాకుండా చేసి తనను దెబ్బకొట్టాలనే కుట్ర జరుగుతోందన్నారు. వంద రోజుల్లోనే నియోజకవర్గానికి మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నామని, వందల కోట్లతో తండాలకు రోడ్లు మంజూరు చేసుకున్నామని, రూ.4 వేల కోట్లతో నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకున్నామని, గత ప్రభుత్వం విద్య, ఉద్యోగాలను విస్మరిస్తే.. తాము మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. ఇంత చేస్తున్న తనను ఎందుకు పడదోయాలని చూస్తున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెరచాటు కుట్రలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
నా గుండెచప్పుడు కొడంగల్..
‘‘నేను ఎక్కడున్నా నా గుండెచప్పుడు కొడంగల్ మాత్రమే. నాతో కొట్లాడే హక్కు మీకుంది. రాష్ట్రానికే నాయకత్వం వహించే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదాం’’ అని కాంగ్రెస్ కార్యకర్తలతో సీఎం రేవంత్ అన్నారు. కొడంగల్‌ను అభివృద్ధి చేయనీయకుండా బీజేపీ నాయకురాలు అరుణమ్మ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణమ్మ.. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రె్‌సను ఓడించాలని బీజేపీ, బీఆరెస్ అంటున్నాయని, ఎందుకు ఓడించాలో చెప్పాలని అన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా? రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా? అని నిలదీశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొడంగల్‌లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిందా ? అని సీఎం ప్రశ్నించారు. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీకి మళ్లీ ఓటేసి గెలిపిస్తే ఆయనేమైనా ఇప్పుడు చంద్రమండలానికి రాజు అవుతారా? అని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా ప్రధానిగా మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అత్యధిక నిధులు తీసుకువచ్చానని, ఎన్నికల తర్వాత మరిన్ని నిధులతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి కొడంగల్ నియోజకవర్గంలో 50 వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని, తన గౌరవం తగ్గకుండా చూడాలని కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలనూ గెలిపిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని అన్నారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి ఆరోగ్యం బాగాలేకపోయినా రాత్రి వరకు సమీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రేవంత్‌రెడ్డి శ్రమను చూసి తాను ముగ్దుడినయ్యానని అన్నారు.
సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం
కాన్వాయ్‌లో పేలిన ఓ వాహనం టైర్
వికారాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):సీఎ రేవంత్‌కు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహనం టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. సోమవారం మధ్యాహ్నం సీఎం కొడంగల్ వెళ్తుండగా వికారాబాద్ జిల్లా మన్నెగూడ సమీపంలో ఒక్కసారిగా కాన్వాయ్‌లో ఉన్న ఓ ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ పేలిపోయింది. డ్రైవర్ కారును పక్కకు మళ్లించి నిలిపివేశాడు. మెకానిక్‌ను పిలిపించి పేలిన టైరును మార్పించారు.