Share News

ఈదురుగాలులు.. వర్ష బీభత్సం

ABN , Publish Date - May 06 , 2024 | 12:09 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ వైపు ఎండలు మండుతుండగా ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది.

ఈదురుగాలులు.. వర్ష బీభత్సం
నల్లగొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌లో తడుచుకుంటూ వెళుతున్న మహిళలు

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

గాలికి లేచిన ఇళ్లపై కప్పులు

నల్లగొండ, శాలిగౌరారం: మే 5: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ వైపు ఎండలు మండుతుండగా ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాకేంద్రంలో సాయంత్రం 6గంటల నుంచి వర్షం మొదలైంది. ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. శాలిగౌరారం మండలంలో ఈదురుగాలులతో అక్కడక్కడ విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి.

సంస్థాన్‌ నారాయణపురం: యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. మండలకేంద్రానికి చెందిన దేశిడి నరేందర్‌రెడ్డి మామిడి తోట దెబ్బతిని మామిడి కాయలు రాలిపోయాయి. నారాయణపురం శివారులోని ఉప్పల కృష్ణకు చెందిన కోళ్ళ షెడ్డు గాలికి కుప్పకూలింది. రెండు షెడ్లు ఉండగా, ఒక షెడ్‌ పూర్తిగా నేలమట్టమైంది. మరోషెడ్డు పాక్షికంగా దెబ్బతిన్నది. వెంకంబాయితండాలో ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంబం కూలిపోయింది. మండలంలోని పలు గ్రామాలలో చెట్లు విరిగిపడ్డాయి.

తిరుమలగిరి రూరల్‌: మండలంలోని తొండ, వెలిశాల గ్రామాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన, తేలికపాటి వర్షం కురిసింది. దీంతో అక్కడక్కడ చెట్లు కూలి, రేకుల ఇండ్లు పైకప్పులు లేచి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వెలిశాల గ్రామంలో తాటిచెట్టుపై పిడుగుపడింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

పిడుగుపాటుతో వ్యవసాయ కూలీ మృతి

అడ్డగూడూరు: యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో పిడుగుపాటుతో వ్యక్తిమృతి చెందాడు. గ్రామానికి చెం దిన వ్యవసాయ కూలీ చిప్పలపల్లి బాలమల్లు(65) తన పాడి గేదెను మేత కోసం వ్యవసాయ బావి వద్దకు తోలుకెళ్లాడు. ఆదివారం సాయంత్రం ఈదు రు, గాలులు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఊరికి దగ్గరలో ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్లాడు. కొట్టం సమీపంలో పిడుగు పడ డంతో బాలమల్లు మృతిచెందగా పాడి గేదె మృత్యువాత పడింది. బాలమల్లుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వలిగొండ: మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. నాగారంలో వడగండ్ల వాన కురిసింది. వడగండ్లకు సుమారుగా 100 ఎకరాల వరి పంట నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యంపై వీచిన గాలులకు పట్టాలు లేచిపోయి కొంతమేరకు ధాన్యం తడిసింది. వెంకటాపురం గ్రామంలో జక్కల కృష్ణ అనే రైతుకు చెందిన పాడి ఆవు పిడుగుపాటుకు మృతిచెందింది.

రామన్నపేట: మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో పెనుగాలులతో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షం కురింది. రామ న్నపేట, నిర్మల, దుబ్బాక గ్రామాల్లో విద్యుత్‌ తీగలు తెగి, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

గుండాల: మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయి. మండలంలోని సీతారాంపురం, మర్రిపడగ గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగాయి. మామిడిపండ్లు రాలిపోయాయి. తుర్కల శాపురం గ్రామంలో జక్కుల యాదయ్య వ్యవసాయ బావి వద్ద పిడుగుపడి పాడిగేదె మృతి చెందింది. దీంతో రూ. 80వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. వివిధ గ్రామాల్లో విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో విద్యుత్‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మోతె: ఈదురుగాలులకు మామిడి కాయలు నేల రాలాయి. అన్నారిగూడెం, నామవరం, సిరికొండ గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు రాలడంతో పాటు చెట్లు కూలిపోయాయి. నామవరం నుంచి గుంజలూరు రోడ్డుకు వెళ్లే దారిలో చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. సిరికొండ నుంచి రావిపహడ్‌ వెళ్లే రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలడంతో పాటు కంప చెట్లు రోడ్డుకు పడిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

చండూరు రూరల్‌: మండలంలోని ఉడుతలపల్లి గ్రామంలో ఆవు మృతిచెందింది. గ్రామానికి చెందిన నిరుపేద రైతు బుషిపాక హుస్సేన్‌ గ్రామ ంలో వ్యవసాయం చేస్తూ ఆవుపాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం కూడా తన వ్యవసాయం పొలం వద్ద ఆవులను మేపి సాయంత్రం బయలుదేరాడు. వర్షం వస్తుండటంతో ఒక ఆవును పొలం వద్ద ఉన్న తాటిచెట్టుకు, మరో ఎద్దును వేరొక చెట్టుకు కట్టేసి దూడను సమీపంలో ఉన్న కొట్టంలోకి తీసుకువెళ్ళాడు. ఇంతలో ఉరుములతో కూడిన పిడుగు పడటంతో వెంటనే అక్కడ కట్టేసి ఉన్న ఆవు మృతిచెందింది. గ్రామానికి చెందిన కావలి బక్కమ్మ ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. అక్కడక్కడ ఈదురు గాలులకు తీగలు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. కస్తాల గ్రామంలో మేకల సత్తిరెడ్డి అనే రైతు వ్యవసాయ బావి వద్ద తాటిచెట్టుపై పిడుగు పడటంతో తాటిచెట్లు కాలిపోతున్నాయి. ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. అకాలంగా కురిసిన వర్షానికి ఈదురు గాలులకు చెట్లు విరిగి కట్ట బక్కయ్య ఇంటిపై పడ్డాయి. అలాగే ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మర్రిగూడ: భారీ వర్షానికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. తిరుగండ్లపల్లి, రాజుపేట తండా గ్రామంలో ఈదురు గాలుల వల్ల పరమేష్‌ ఇంటి సమీపంలో ఉన్న వేప చెట్టు కూలి కారుపై పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అదే గ్రామానికి చెందిన వెంకటయ్య ఇంటిపైన రేకులు లేచిపోయాయి. రాజుపేట తండాలోని రవి నాయక్‌ ఇంటి వద్ద చెట్టు కూలిపోవడంతో ఇల్లు కూడా ధ్వంసమైంది. అర్ధగంట సేపు ఈదురుగాలులు రావడంతో విద్యుత్‌ స్తంభాలు కూలి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

పెద్దఅడిశర్లపల్లి: మండల వ్యాప్తంగా మోతాదు వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం కుప్పలపై గాలిదూమారానికి పట్టాలు లేచిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు.

కేతేపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులకు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై కురిసిన చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో తీవ్రమైన వేసవి ఎండలతో నెల రోజులుగా అల్లాడిన మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

ఆత్మకూర్‌(ఎస్‌): మండలంలోని సూర్యాపేట దంతాలపల్లి రోడ్డుపై పాతర్లపహాడ్‌ స్టేజీ నుంచి సూమారుగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్లు గాలి తాకిడికి కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నూతన్‌కల్‌ మండలం నుంచి రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కిపోయింది. పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన సోములు అనే వ్యక్తి ఇంటిపై విద్యుత్‌ స్తంభం పడిపోవడంతో ఇల్లు స్వల్పంగా దెబ్బతిన్నది. ఏపూర్‌ లో సానబోయిన సోమయ్య తన గేదెను ఇంటి ముందు చెట్టుకు కట్టేసి ఉండగా చెట్టు కూలి గేదే పై పడిపోవడంతో గేదె మృతిచెందింది. పీపానాయక్‌ తండాలో గూగులోత్‌ బుజ్జమ్మకు చెందిన రేకుల ఇల్లు గాలికి లేచిపోయింది. బోరింగ్‌ తండాలో రేషన్‌ షాపుపై కప్పు రేకులు లేచిపోవడంతో బియ్యం బస్తాలు తడిసిపోయాయి. గట్టికల్‌ గ్రామంలో సాలమ్మ ఇంటి ముందు వేప చెట్టు విద్యుత్‌ తీగలపై కూలిపోవడంతో తీగలు రోడ్డు పై తెగిపడ్డాయి. పాతర్లపహాడ్‌ స్టేజీ వద్ద రావుల సతీష్‌, భద్రయ్య, లక్ష్మయ్య, మధుకర్‌, సురేష్‌ల రేకుల ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. పాత సూర్యాపేట లో విద్యుత్‌ మెయిన్‌ లైన్‌ స్తంభం గూడూరు వెంకట్‌రెడ్డి ఇంటిపై పడింది. ఇల్లు ధ్వంసం అయ్యింది. గొర్రెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వళ్లపు శంకర్‌, కొప్పు హారీష్‌, రేకులు గాలికి లేచిపోయాయి. రామన్నగూడెం గ్రామానికి రైతు గొలుసుల రాములు కు చెందిన ఎద్దు పిడుగుపాటుకు గురై చనిపోయింది. ఎద్దు విలువ రూ. లక్ష వరకు ఉంటుందని రైతు తెలిపాడు.

నాగారం: ఈదురు గాలుల బీభత్సంతో నాగారం మండలంలో పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి, విద్యుత్‌ లైన్‌లు తెగిపోయాయి,స్తంభాలు విరిగిపోయాయి. ఈదురుగాలులతో ఈటూరులో మామిడి తోటలో కాయాలు రాలాయి. నాగారంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. నాగారం తుంగతుర్తి రహదారిపై చేట్లు విరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శాంతినగర్‌ గ్రామంలో టాన్సపార్మర్‌ కూలిపోయి విద్యుత్‌ అంతరాయం కలిగింది. నాగారం బంగ్లా గ్రామపంచాయతీ పరిధిలోని వసుధ రైస్‌మిల్లు పైకప్పు లేచిపోవడంతో మిల్లులో ధాన్యం తడిసిపోయాయి. మండలంలో ఆదివారం ఆకస్మాత్తుగా వీచిన గాలి వానతో ఽభారీగా ఆస్తి నష్టం జరిగింది. ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన బస్తాలు తడిసిపోయాయి, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

మోత్కూరు: యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంతో పాటు కొండగడప, బుజిలాపురం, పాటిమట్ల తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం భీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరు పులతో విపరీతమైన గాలులు వీచడంతో చెట్లు విరిగాయి. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి, తీగలు తెగి మం డలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బుజిలాపురంలో ఎండబోసినట్టు వడగళ్లు కురిశాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు, తూకం వేసిన బస్తాలు టార్పాలిన్లతో కప్పిపెట్టినప్పటికీ గాలికి టార్పాలిన్లు లేచిపోయి బస్తా లు, ధాన్యం రాశులు తడిచాయి. మామిడి, నిమ్మ తోటల్లో ఉన్న కాయలు రాలిపోయాయి. బుజిలాపురంలోని తమ తోటల్లో మామిడి కాయలు రాలిపో యాయని మామిడి రైతులు చింతల విజయభాస్కర్‌రెడ్డి, మడూరు యా దిరెడ్డి తెలిపారు. గుడిసెలు గాలికి లేచిపోయాయి. మోత్కూ రులో కంచర్ల మోహన్‌రెడ్డి ఇంటిపై కప్పులేచిపోయింది. కొండాపురంలో నీల నర్సయ్య, సారగండ్ల జగన్నాధం, మన్నె బుచ్చిరాములు, నీల సోమయ్య, బీసు రమేష్‌ తోపాటు మరికొంత మంది ఇంటి ముందు వేసుకున్న పాకలు, వంట గది రేకులు లేచిపోయాయి. కొండగడపలో ఇంటి రేకులు లేచిపోయాయి. ముశి పట్ల, దత్తప్పగూడెం, అనాజిపురం, పాలడుగు గ్రామాల్లో ఈదురు గాలులు వీచాయి. చెట్లు విరిగి పడ్డాయి. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. ముశిపట్లలో విద్యుత్‌ స్తంభం విరిగిపడింది. ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడటం వల్ల మర్రిగూడ, ఎరుగండ్లపల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. అదేవిధంగా సంచులలో నింపిన ధాన్యం కూడా తడిసి ముద్దయ్యాయి.

Updated Date - May 06 , 2024 | 12:09 AM