రాజ్యసభకు సుధామూర్తి
ABN , Publish Date - Mar 09 , 2024 | 02:47 AM
ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధామూర్తి(73)ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు
నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము
మీ నియామకం నారీశక్తికి ప్రతీక
ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఇది మహిళా దినోత్సవ కానుక
సేవకు పెద్ద వేదిక: సుధామూర్తి
న్యూఢిల్లీ/బెంగళూరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధామూర్తి(73)ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘సామాజిక, విద్యారంగంలో, దాతృత్వంలో సుధామూర్తి సేవలు స్ఫూర్తిదాయకం. పెద్దల సభలో ఆమె ఉనికి నారీశక్తికి తిరుగులేని నిదర్శనం. ఆమె పదవీకాలం ఫలప్రదమవ్వాలి’ అని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాజ్యసభకు ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2006లో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆమెకు.. నిరుడు పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. మహిళా దినోత్సవాన తనను రాజ్యసభకు ఎంపిక చేయడం రెట్టింపు విస్మయానికి గురిచేసిందని సుధామూర్తి అన్నారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న ఆమె.. ‘చాలా సంతోషంగా ఉంది. నా కృషిని మోదీ గుర్తించారు. ఆయనకు ధన్యవాదాలు. ఇది మహిళాదినోత్సవం సందర్భంగా ప్రధాని నాకు ఇచ్చిన కానుక. పేదల కోసం పనిచేసేందుకు పెద్ద వేదిక దొరికినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.