లగచర్ల ఏ-2 సురేశ్‌రాజ్ లొంగుబాటు
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:06 AM
లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కీలక పాత్రధారి, రెండో నిందితుడు (ఏ-2) బోనగాని సురేశ్ రాజ్ కోర్టులో లొంగిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో
న్యాయవాదులతో కలిసి కొండగల్ కోర్టుకు..
గ్రామంలో అధికారులపై దాడి ఘటన అనంతరం పరారీ
ఈ కేసులో మరో ఇద్దరిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
14 రోజుల రిమాండ్.. సంగారెడ్డి జైలుకు.. కస్టడీకి పిటిషన్
రేవంత్ గుర్తుపెట్టుకో.. రాకెట్‌లా తిరిగొస్తా: సురేశ్
లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా!
వికారాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కీలక పాత్రధారి, రెండో నిందితుడు (ఏ-2) బోనగాని సురేశ్ రాజ్ కోర్టులో లొంగిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయిన అతనికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయకుమార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై రైతులు, గ్రామస్థులు దాడి చేయడం వెనక సురేశ్ రాజ్ కీలకంగా వ్యవహరించాడన్న అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా.. అప్పటి నుంచి సురేశ్ రాజ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం వారం రోజులుగా నాలుగు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతను పోలీసుల కళ్లుగప్పి నేరుగా కోర్టు లో లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది లా ఉండగా, ఇదే కేసులో ఏ-38 నేరెళ్ల హనుమంతు, ఏ-41 నీరటి సురేశ్‌ను మంగళవారం కోర్టులో హాజరుపరచగా వారికీ 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ముగ్గురు నిందితులనూ సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. కాగా.. సురేశ్ రాజ్‌ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ-1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 28కి చేరుకుంది. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై దాడిని రాజకీయ కుట్రగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురేశ్ రాజ్ సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తే ముఖ్యమైన సమాచార ం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
వారం రోజులు ఎక్కడున్నాడు?
లగచర్ల ఘటన తర్వాత పరారీలో ఉన్న సురేశ్ రాజ్ వారం రోజుల పాటు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరినీ కలిశాడనేది చర్చనీయాంశంగా మారింది. అతనికి ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టిన సురేశ్ రాజ్ తన ఫోన్ కాకుండా వేరే ఫోన్, సిమ్ కార్డులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. అతను హైదరాబాద్‌లోనే షెల్టర్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సురేశ్‌రాజ్‌ను పోలీసులు విచారణ చేస్తే లగచర్ల ఘటన సూత్రధారులతో పాటు అతనికి ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయం తెలుస్తుందని అంటున్నారు.
రైతులతో మాట్లాడేందుకు రావాలని చెప్పి..
ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూ సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు ఈ నెల 11న లగచర్ల వచ్చిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి వెనక సురేశ్‌రాజ్‌ను కీలక పాత్రధారిగా పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్ల శివారులో సమావేశం ఏర్పాటు చేయగా, రైతులు ఎవరూ హాజరు కాలేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సురేశ్ రాజ్ రైతులందరూ లగచర్లలో ఉన్నారని, అక్కడికే వచ్చి వారితో మాట్లాడాలంటూ కలెక్టర్‌ను కోరాడు. దాంతో ఆయన ఇతర అధికారులతో కలిసి వెళ్లారు. అధికారులు తమ వాహనాల నుంచి దిగి వెళుతున్న సమయంలో వారిపై దాడి చోటుచేసుకుంది. అధికారులపై దాడి చేసేలా అక్కడి రైతులను, ప్రజలను ఉసిగొల్పడంలో కీలకంగా వ్యవహరించాడన్న అభియోగాన్ని సురేశ్ రాజ్ ఎదుర్కొంటున్నాడు.
రేవంత్ రెడ్డీ.. గుర్తుపెట్టుకో..!
రాకెట్ వేగంతో తిరిగొస్తా: సురేశ్ రాజ్
‘రేవంత్ రెడ్డీ గుర్తుపెట్టుకో.. రాకెట్ వేగంతో తిరిగి వస్తా.. రైతుల పక్షాన పోరాటం చేస్తా’ అని లగచర్ల నిందితుడు సురేశ్ రాజ్ అన్నాడు. మంగళవారం అతనికి కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న సమయంలో అక్కడున్న మీడియాను చూసి ఈ వ్యాఖ్యలు చేశాడు.
లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా!: అపాయింట్‌మెంట్ కోరిన బీఆర్‌ఎస్
న్యూఢిల్లీ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు తె లిసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నేతృత్వంలో 15మంది మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయిట్‌మెంట్ కోరారు. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాల యం బీఆర్‌ఎ్‌సను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్‌కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్‌ఎస్ అందించినట్టు సమాచారం. కాగా, సత్యవతి రాథోడ్ మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గిరిజన నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ గిరిజనులపై తన ప్రతాపం చూపిస్తోందన్నారు. లగచర్ల దారుణాలను బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తోందని ఆరోపించారు.