Suryapet : తీవ్ర జ్వరం, వైద్యం వికటించి.. గురుకుల విద్యార్థిని మృతి
ABN , Publish Date - Jul 17 , 2024 | 05:49 AM
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్‌లోని బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికకు చేసిన వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
సూర్యాపేట జిల్లా దోసపహాడ్‌లోని పాఠశాలలో ఘటన
పెన్‌పహాడ్, జూలై 16: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్‌లోని బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికకు చేసిన వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. నూతనకల్ మండలం మాచినపల్లికి చెందిన కొంపెల్లి సరస్వతి(10) దోసపహాడ్‌లోని బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సరస్వతి సోమవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా ఉపాధ్యాయులు దోసపహాడ్‌లోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఇంజక్షన్ చేశారు.
ఆ తర్వాత పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సరస్వతి అప్పటికే మరణించిందని తెలిపారు. బాలిక తండ్రి కొంపెల్లి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించగా సరస్వతి ఇంట్లో ఒకరికి బీసీ గురుకులంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సరస్వతి తల్లిదండ్రులతో మాట్లాడిన గురుకుల పాఠశాల అధికారులు బీసీ వెల్ఫేర్ నుంచి రూ.2లక్షలు, ప్రిన్సిపాల్ నుంచి రూ.2లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.