Share News

ఆరోగ్య కేంద్రాలకు సుస్తీ

ABN , Publish Date - Dec 23 , 2024 | 02:07 AM

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.

ఆరోగ్య కేంద్రాలకు సుస్తీ

- అడుగడుగునా సమస్యలు

- వసతులు లేక ఇబ్బందులు

- వేధిస్తున్న సిబ్బంది కొరత

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గన్నేరువరం లాంటి మూరుమూల మండలంలో పీహెచ్‌సీ లేకపోవడంతో ప్రజలు వైద్యం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉంది. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌కు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మంజూరైనా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. ఆ కేంద్రానికి కేటాయించిన సిబ్బంది కొత్తపల్లి కేంద్రంలోనే విధులు నిర్వహిస్తున్నారు. పలు కేంద్రాలకు ప్రహరీ లేకపోవడంతో విష పురుగులు ఆస్పత్రుల్లోకి వస్తున్నాయి. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి పరిశీలన’..

- న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి

ఫ ఇద్దరు వైద్యులూ సెలవుల్లోనే..

తిమ్మాపూర్‌: మండలంలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో సిబ్బంది కొరత ఉంది. మండల కేంద్రంలో ప్రాథమిక కేంద్రంతో పాటు మండలంలో తొమ్మిది సబ్‌ సెంటర్లు ఉన్నాయి. తిమ్మాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, స్టాఫ్‌ నర్సు, సీనియర్‌ అసిస్టేంట్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, మల్టీ పర్సన్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ (మేల్‌), మల్టీ పర్సన్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ (ఫిమేల్‌), స్టాఫ్‌ నర్స్‌ (ఎన్‌సీడీ), డాటా ఏంట్రి ఆపరేటర్‌, అటెండర్‌ ఒకరు చొప్పున ఉండాలి. పీహెచ్‌సీలో ఉన్న ఇద్దరు డాక్టర్లు సెలవులో ఉన్నారు. కొందరు సిబ్బంది డిప్యూటేషన్‌లో ఉన్నారు. గతంలో ఇక్కడ ప్రసవాలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదు. ఇద్దరు డాక్టర్లు సెలవులో ఉండడంతో గుమ్లాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ను ఇక్కడ డిప్యుటేషన్‌పై నియమించారు.. పీహెచ్‌సీ పరిధిలోని నాలుగు సబ్‌ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. ఐదు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

ఫ పట్టణానికి దూరంగా..

భగత్‌నగర్‌: కొత్తపల్లి ఆరోగ్యకేంద్రం పట్టణానికి దూరంగా ఉండడంతో రోగులు బ్బందులు పడుతున్నారు. కొత్తపల్లి నుంచి కరీంనగర్‌ రోడ్డుకు కిలో మీటరు దూరంలో ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తపల్లి ఆరోగ్య కేంద్రానికి కొత్తపల్లి పట్టణంతోపాటు, రేకుర్తి, రామడుగు మండలంలోని వెలిచాల, కొక్కెరకుంట, రుద్రారం, అన్నారం గ్రామాల నుంచి రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఆరోగ్య కేంద్ర దూరంగా ఉన్నా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని వచ్చిన రోగులు వైద్యులతో పాటు, సిబ్బంది అందుబాటులో ఉండక పోవడం అవస్థలు పడుతున్నారు. కొత్తపల్లి ఆరోగ్యకేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరొకరు డిప్యూటేషన్‌లో ఉన్నారు. ఉన్నవైద్యురాలు మీటింగ్‌లు, జిల్లా సమావేశాలకు వెళ్తుండడంతో రోగులకు వైద్యం అందక ఇబ్బందులు పడాల్సి వస్తున్నదిు. ఆరోగ్య కేంద్రంలో బీపీ, జనరల్‌ మాత్రలు కూడా అందుబాటులో ఉండడం లేదు. కొత్తపల్లి మండలంలో రెండు ఆరోగ్య కేంద్రాలకు గాను ఆసిఫ్‌నగర్‌ ఆరోగ్య కేంద్రం కాగితాలకే పరిమితమైంది. ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది అంతా కొత్తపల్లి ఆరోగ్య కేంద్రం నుంచే విధులు నిర్వహిస్తున్నారు.

ఫ ప్రహరీ లేక ఇబ్బదులు

ఇల్లందకుంట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో ప్రజలు, సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రభుత్వాస్పత్రికి వందలాది మంది వైద్యం చేయించుకోవడానికి వస్తారు. మండలంలో ఐదు సబ్‌ సెంటర్లు ఉండగా అందులో 12మంది ఏఎన్‌ఎంలకు గాను 8మంది ఉన్నారు. మరొక నాలుగు సెంటర్లకు నలుగురు సెకండ్‌ ఏఎన్‌ఎంలు అవసరం ఉంది. వర్షాకాలంలో చెరువులోని నీరు ఆస్పత్రిలో మెట్ల వరకు చేరుకుంటాయి. ప్రహరీ లేకపోవడంతో విషపురుగులు ఆసుపత్రిలోకి వస్తున్నాయి.

ఫ అన్నీ సమస్యలే..

జమ్మికుంట రూరల్‌: జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు తిష్టవేశాయి. భవనం పైపెచ్చులు ఊడి పడుతుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. స్లాబ్‌పైన ఉన్న పైపులను కోతులు ద్వంసం చేయడంతో ప్లంబింగ్‌ సమస్య ఏర్పడింది. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులున్నాయి. భవనం చుట్టూ ప్రహరీ లేదు.

ఫ అద్దె భవనాల్లో ఇబ్బందులు

గంగాధర: మండలంలోని పల్లె దవాఖానాలు అద్దె భవనాల్లో అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. గంగాధరలో పీహెచ్‌సీతో పాటు తొమ్మిది సబ్‌ సెంటర్లున్నాయి. గంగాధర, గర్షకుర్తి, బూరుగుపల్లి, ర్యాలపల్లి గ్రామాల్లో పక్క భవనాలుండగా మిగతా సెంటర్లని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ర్యాలపల్లి, కురిక్యాల సబ్‌ సెంటర్లలో వైద్యులు లేక ఏఎన్‌ఎంలే సేవలందిస్తున్నారు. గంగాధరలో ఎక్కువగా కుక్క, కోతులు, ఎలుకలు కరిచిన కేసులు ఎక్కువ వస్తున్నాయి. పల్లె దవాఖానాల్లో బీపీ, షుగర్‌, జ్వరానికి మాత్రమే మాత్రలు అందుబాటులో ఉంటున్నాయి. గంగాధర పీహెచ్‌సీతో పాటు గ్రామాల్లో వైద్యులు సమయపాలన పాటించడంలేదనే విమర్శలున్నాయి.

ఫ అందని సర్కారు వైద్యం

గన్నేరువరం: మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం పక్క మండలమైన తిమ్మాపూర్‌, లేకపోతే కరీంనగర్‌కు వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో చికిత్స అందక ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. మండలంలో గన్నేరువరం, ఖాసింపేట, జంగపల్లి, గునుకుల కొండాపూర్‌ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా వీటిని పల్లె దవాఖానాలుగా మార్చారు. మండలానికి పీహెచ్‌సీ లేదు. ఉన్న నాలుగు గ్రామాల్లోని సబ్‌ సెంటర్లలో హెల్త్‌ అసిస్టెంట్లు లేదు.

ఫ శిథిలావస్థలో భవనం

సైదాపూర్‌: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం శిథిలాస్థలకు చేరుకుంది. పైకప్పు పెచ్చులూడుతోంది. వర్షం కురిస్తే ఆస్పత్రిలోకి నీరు చేరుతుంది. హాల్‌, బెడ్స్‌ వార్డు, డాక్టర్‌ గదితో పాటు ఇతర గదులు పూర్త్తిగా దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలో చేసిన వైరింగ్‌ సక్రమంగా లేక విద్యుత్‌ సమస్యల తలెత్తుతోంది.

Updated Date - Dec 23 , 2024 | 02:07 AM