Share News

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

ABN , Publish Date - Aug 02 , 2024 | 08:34 PM

ఏకంగా 9 రోజుల పాటు ప్రభుత్వ-ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
TS Assembly Session

హైదరాబాద్: ఏకంగా 9 రోజుల పాటు ప్రభుత్వ-ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. శాసన సభ మొత్తం 65 గంటల 33 నిమిషాల పాటు జరిగింది. 5 బిల్లులకు ఆమోదం లభించింది. 32 ప్రశ్నలపై సభలో చర్చ జరిగింది. రెండు అంశాలపై స్వల్ప కాలిన చర్చ నడిచింది.


కాగా ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం కట్టడం, కూలడం అయిపోయిందని, అయినా ఇంతవరకు డీపీఆర్ లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూసీ అభివృద్ధి పనులు మొదలు పెట్టకముందే కేటీఆర్ డీపీఆర్ అడుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మూసీ కబ్జాలను తొలగిస్తామని, మూసీపై 10,800 ఇళ్లు ఉన్నాయని, వారందరికీ ప్రత్యమ్నాయం చూపించి భూమి సేకరిస్తామని చెప్పారు.

కేటీఆర్‌పై సెటైర్లు..

‘‘లాంగ్వేజ్ వేరు నాలెడ్జ్ వేరు. కేటీఆర్ ఇది తెలుసుకోవాలి. అవతలి వారిని అవహేళన చేయకూడదు అనే అవగాహన కేటీఆర్‌కి ఉండాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘గజ్వేల్‌కు ఇచ్చిన నీరు శ్రీపాద ఎల్లంపల్లి పైప్ లైన్ నుంచి బొక్క పెట్టి తీసుకెళ్లారు. దానం నాగేందర్ సభలో మాట్లాడితే తప్పేంటి?.

ఒక సభ్యునికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ సభ్యులకు ఎక్కడిది?. బీఆర్ఎస్ తీరును ఓపికతో చూస్తున్నాం. కోమటిరెడ్డి, సంపత్‌ను ఈ సభలో ఏం చేశారో మనం చూడలేదా?. ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధి వస్తుంది’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


దానం నాగేందర్ వీధి రౌడీలా వ్యవహరించాడు: వేముల ప్రశాంత్ రెడ్డి

దానం నాగేందర్ వీధి రౌడీలా వ్యవహరించాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిండు సభలో దానం నాగేందర్ వీధి రౌడీలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాతృమూర్తులను కించపరిచేలా మాట్లాడిన దానంపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


అమెరికా పర్యటనకు సీఎం, మంత్రులు

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు (శనివారం) ఉదయం 4 గంటలకు బయలుదేరనున్నారు. ఎల్లుండి (ఆదివారం) మంత్రి శ్రీధర్ బాబు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 5న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను సీఎం, మంత్రులు కోరనున్నారు.

Updated Date - Aug 02 , 2024 | 08:58 PM