Telangana High Court: బీఆర్ఎస్‌కు కోకాపేట్‌లో 11 ఎకరాలపై పిల్.. విచారణకు స్వీకరించిన హైకోర్టు
ABN , Publish Date - Jan 25 , 2024 | 08:46 PM
గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో 11 ఎకరాల భూమిని కేటాయించడంపై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఖరీదైన భూమిని పార్టీ కార్యాలయం కోసం బీఆర్ఎస్‌కు కేటాయించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) చిక్కుడు ప్రభాకర్ ఈ పిటిషన్ వేశారు.
గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో 11 ఎకరాల భూమిని కేటాయించడంపై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఖరీదైన భూమిని పార్టీ కార్యాలయం కోసం బీఆర్ఎస్‌కు కేటాయించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) చిక్కుడు ప్రభాకర్ ఈ పిటిషన్ వేశారు. ఆల్రెడీ బంజారాహిల్స్‌లో పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు, మళ్లీ ఈ భూమిని కేటాయించారని పిటిషనర్ చెప్పారు. కోకాపేట సర్వే నంబర్ 239, 240లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో 11 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకి ల్యాండ్ కేటాయించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని.. కేవలం ఐదు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యిందని.. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1,100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పిటిషనర్ తెలిపారు. ఈ భూ కేటాయింపుల విషయంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ కేసు నమోదు చేసెలా ఆదేశాలు ఇవ్వాలని.. భూ కేటాయింపు జీవోని రద్దు చేసి, కోకాపేటలో నిర్మాణ పనులు జరగకుండా స్టే విధించాలని పిటిషనర్ కోరారు. అంతేకాదు.. ప్రతివాదులుగా అధికారులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పేరుని కూడా చేర్చారు. ఈ పిటిషన్‌ని గతేడాది జులైలో దాఖలు చేయగా.. దీనిపై విచారణకు హైకోర్టు తాజాగా స్వీకరించింది.