Share News

TS Assembly Session: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు... బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:39 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్‌పై ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ మేరకు సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

TS Assembly Session: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు... బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్‌పై ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ మేరకు సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


కాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 ఎంపీ సీట్లు గెలిచినా తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకురాలేకపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర నిధులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిందని, అయినా రాష్ట్ర స్వశక్తితో తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారమని ప్రస్తావించారు. 10 సంవత్సరాల నుంచి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశారని, ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని, బీజేపీ కేంద్రమంత్రులను కలిశారని కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారంటూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటూ ఆయన అన్నారు.


రాజకీయ కుట్రలను ఎదుర్కోవడం బీఆర్‌ఎస్ పార్టీకి కొత్త కాదని ఎమ్మె్ల్యే వివేకానంద గౌడ అన్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్లు హక్కులు కోసం మాట్లాడారని, మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర హక్కులు కోసం ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు.


బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘‘ఒక్కసారి ఆలోచన చేయండి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కి రూ.15 వేల కోట్లు ఇచ్చి తెలంగాణాకు ఒక్క రూపాయ ఇవ్వకపోవడం బాధాకరం. రెండు జాతీయ పార్టీల ఎంపీలను ఇక్కడ నుంచి గెలిపిస్తే ఒక్క రూపాయ తీసుకొరాలేకపోయారు. కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామరక్ష. కాంగ్రెస్, బీజేపీ పార్టీని నిలదీస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటిల పైన కూడా నిలదీస్తాం. ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు. సిగ్గులేకుండా పేపర్ యాడ్ ఇచ్చుకుంటున్నారు’’ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

Updated Date - Jul 24 , 2024 | 11:45 AM