Share News

సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ యువత

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:53 AM

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో తెలంగాణ యువత ప్రతిభ కనబరిచారు. వందలోపు ర్యాంకుల్లో ముగ్గురు అభ్యర్థులు స్థానం సంపాదించి జయకేతనం ఎగరేశారు. తండ్రిని కోల్పోయి.. తల్లి బీడీలు చుడుతూ కష్టపడితే వచ్చిన డబ్బులతో

సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ యువత

27వ ర్యాంకుతో కరీంనగర్‌ బిడ్డ సాయికిరణ్‌ సత్తా..

తల్లి బీడీ కార్మికురాలు.. కోచింగ్‌ లేకుండానే కొలువు

22 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన వికారాబాద్‌ వాసి తరుణ్‌

కటిక పేద కుటుంబం.. తల్లిదండ్రులు రోజు కూలీలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో తెలంగాణ యువత ప్రతిభ కనబరిచారు. వందలోపు ర్యాంకుల్లో ముగ్గురు అభ్యర్థులు స్థానం సంపాదించి జయకేతనం ఎగరేశారు. తండ్రిని కోల్పోయి.. తల్లి బీడీలు చుడుతూ కష్టపడితే వచ్చిన డబ్బులతో చదువుకున్న కరీంనగర్‌ యువకుడు సాయికిరణ్‌ 27వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు. కటిక పేదరికంలో పెరిగి.. తల్లిదండ్రులు ఇచ్చిన కూలీ పైసలతో చదువుకుని.. 22 ఏళ్లకే ఐఏఎస్‌ కొలువు సాధించి.. వికారాబాద్‌ కుర్రాడు దయ్యాల తరుణ్‌ శభాష్‌ అనిపించారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు కౌశిక్‌ మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్స్‌లో (ఐఐఎ్‌ఫటీ)లో ఎంబీఏ పూర్తి చేశారు. ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. సివిల్స్‌ ప్రిపరేషన్‌లో రోజుకు 12 గంటలకు పైగా చదివానని కౌశిక్‌ తెలిపారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ నగర్‌కు చెందిన రావుల జయసింహారెడ్డి 103వ ర్యాంకు సాధించారు. గత ఏడాది 217వ ర్యాంకు సాధించిన ఆయన ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం అల్వాలకు చెందిన పెంకీస్‌ ధీరజ్‌రెడ్డి 173వ ర్యాంకు సాధించారు. ఆయన 2015లో ఐఐటీ జేఈఈలో ఆల్‌ ఇండియా 64వ ర్యాంకు సాధించి ఐఐటీ ఢిల్లీలో చేరారు. సివిల్స్‌పై ఆసక్తితో కొద్ది నెలలకే బీటెక్‌ ఆపేశారు. ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ద్వారా 2015లో బీఏ కోర్సులో చేరారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సన్నద్ధమవుతూ మూడుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాశారు. ప్రస్తుతం ఐపీఎస్‌ లేదా వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏక్‌ ద ముఫాసిర్‌ 278వ ర్యాంకు సాధించారు. న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె టాపర్‌గా నిలిచారు. అనంతరం ఇంట్లోనే సివిల్స్‌కు సిద్ధయ్యారు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సైంపు కిరణ్‌కుమార్‌ 568వ ర్యాంకు సాధించారు. గతంలో వచ్చిన ర్యాంకుతో ప్రస్తుతం ఇండియన్‌ పోస్టల్‌ సర్వీ్‌సలో విజయవాడ, విశాఖ నగరాల్లో పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.

పేద బిడ్డలు.. చదువులో మెరికలు..

సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ధి అఖిల్‌ 321వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. 2019లో ప్రిలిమ్స్‌లో.. 2020లో మెయిన్స్‌లో ఫెయిల్‌ అయ్యారు. 2021లో 566వ ర్యాంకు సాధించి.. ప్రస్తుతం ఢిల్లీలో ఏసీపీగా పనిచేస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన నిరుపేద అభ్యర్థి కొయ్యడ ప్రణయ్‌ 554వ ర్యాంకు సాధించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పాలిటెక్నిక్‌ వరకు చదివిన ఆయన.. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో బీటెక్‌ ఎలకా్ట్రనిక్స్‌ చదివారు.

పట్టు వదలకుండా శ్రమించి..

నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్త్యావత్‌ యశ్వంత్‌నాయక్‌ 627వ ర్యాంకు సాధించారు. మొదటిసారి ఇంటర్వ్యూలో విఫలమైన యశ్వంత్‌ పట్టుదలతో రెండోసారి పరీక్ష రాశారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ కుమారుడు ఆరె విశాల్‌ 718వ ర్యాంకు సాధించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన కొలనుపాక సహన నాలుగో ప్రయత్నంలో 739వ ర్యాంకు పొందారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలోని శివనగర్‌కు చెందిన కోటే అనిల్‌కుమార్‌ 764వ ర్యాంకు పొందారు. గతేడాది 4వ ప్రయత్నంలో 584 ర్యాంకు రాగా, కోల్‌కతాలో ఇండియన్‌ పోస్టల్‌ సర్వీ్‌సలో పనిచేస్తున్నానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన శశికాంత్‌ 891వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆయన అస్సాంలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం గోవిందాపురం(ఎల్‌) గ్రామానికి చెందిన సాయి అలేఖ్య ఐదో ప్రయత్నంలో 938వ ర్యాంకు సాధించారు.

మెరిసిన తెలుగు తేజాలు..

సివిల్స్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 23 మంది వెయ్యిలోపు ర్యాంకులు పొందారు. అక్షయ్‌ దీపక్‌ 196వ ర్యాంకు, లక్ష్మీ అన్నపూర్ణ(198), అనూష పిళ్లై(202), ఓంకార్‌(202), సయ్యద్‌ ముస్తాఫా హష్మీ(312), ఎన్‌.ప్రదీ్‌పరెడ్డి(382), నందిరాజు శ్రీమేఘన దేవ్‌(411), కృష్ణ శ్రీవాస్తవ్‌(444), బన్న వెంకటేశ్‌(467), హరి ప్రసాద్‌రాజ్‌(475), పూల ధనుష్‌(480), ఏ.మౌనిక(487), పృథ్వీరాజ్‌(493), కె.శ్రీనివాసులు(526), నెల్లూరు సాయితేజ(558), కిరణ్‌(568), నాగభరత్‌(580), భార్గవ్‌(590), కె.అర్పిత(639), సాక్షి కుమారి(679), రాజ్‌కుమార్‌ (703), గాదె శ్వేత(711), వి. ధనుంజయ్‌కుమార్‌(810), లక్ష్మీ బానోతు(828), ఆదా సందీప్‌ కుమార్‌(830), రాహుల్‌(873), హనిత వేముల పాటి(887), కె.శశికాంత్‌(891), కే.మీన(899), గోవద నవ్యశ్రీ 995వ ర్యాంకులు సాధించారు.

చేనేత బిడ్డ.. చాటాడు సత్తా

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నంద్యాల సాయికిరణ్‌ 27వ ర్యాంకు సాధించారు. నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన సాయికిరణ్‌ తండ్రి కాంతయ్య పవర్‌లూమ్‌ కార్మికుడిగా పనిచేస్తూ ఎనిమిదేళ్ల కిత్రం క్యాన్సర్‌ బారినపడి చనిపోయారు. తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలు. తండ్రి మృతిచెందడంతో తల్లి కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు పిల్లలను చదివించింది. వరంగల్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ పూర్తి చేసిన సాయి కిరణ్‌.. హైదరాబాద్‌లో సీనియర్‌ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. కోచింగ్‌ లేకుండానే రెండో ప్రయత్నంలోవిజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తన కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు. తనలాగే కష్టపడే వారికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. సాయి కిరణ్‌ అక్క స్రవంతి ఆర్‌డబ్ల్యూఎ్‌సలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.


2aniltha.jpg

వెన్నులో ఇన్ఫెక్షన్‌తో కాళ్లు చచ్చుబడినా..

ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన అనిత వేములపాటి సివిల్స్‌ నాలుగో ప్రయత్నంలో 887 ర్యాంక్‌ సాధించారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో రెండో సెమిస్టర్‌ చదువుతుండగా వెన్నులో ఇన్ఫెక్షన్‌ రావడంతో రెండు కాళ్లు చచ్చుబడి వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. అయినా నిరాశ చెందకుండా డిగ్రీ పూర్తి చేసి అమ్మనాన్నల ప్రోత్సాహంతో సివిల్స్‌ సాధించారు. అనిత తండ్రి రామచంద్రరావు రైల్వేశాఖలో ఉన్నతాధికారిగా, తల్లి ఇందిరాదేవి ఐసీడీఎ్‌సలో అధికారిగా పనిచేస్తున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 03:55 AM