అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన కారు
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:02 AM
నల్లగొండ జిల్లా మునుగోడు శివారులో ఆదివారం రాత్రి బొలెరో వాహనం అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది.
అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన కారు
తృటిలో ప్రాణాలతో బయటపడిన నలుగురు
వెంటనే స్పందించిన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది
బావిలో పడిన బొలెరో వాహనంపై కూర్చున్న బాధితులు
మునుగోడు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు శివారులో ఆదివారం రాత్రి బొలెరో వాహనం అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయపడ్డారు. కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన జడిగల రాజు, తన భార్య పుష్పలత, కుమారులు సిద్దు, లక్కీలతో కలిసి కనగల్ మండలం పొనుగోడు గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్లి సొంతూరుకు తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలోని మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ శివారులోని గోపిరెడ్డోని బావి మూలమలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. వాహనం దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. బావిలో పడిన వాహనం నుంచి బయటికి వచ్చి దానిపై కూర్చొని, వారి వద్ద ఉన్న ఫోన్లతో బంధువులకు సమాచారం ఇచ్చారు. తమను బయటకు తీయాలని కేకలు వేశారు. అప్పటికే ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని వారికి ధైర్యం చెప్పారు. వెంటనే ఫైర్ పోలీ్‌సస్టేషనకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను బయటకు తీశారు. అదృష్టవశాత్తు వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక పీహెచసీకి తరలించి వైద్య చికిత్స అందించారు. అక్కడికి చేరుకున్న బంధువులు వారిని తీసుకెళ్లారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, అగ్ని మాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.