Share News

మారనున్న ‘స్థానిక’ ముఖచిత్రం

ABN , Publish Date - Dec 23 , 2024 | 02:05 AM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ముఖచిత్రం మారనున్నది. గత ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం-2018కి ప్రభుత్వం పలు సవరణలు చేసింది. దీంతో ఎన్నికల్లో రిజర్వేషన్లు మారనున్నాయి.

మారనున్న ‘స్థానిక’ ముఖచిత్రం

- ఎన్నికల్లో పదేళ్ల రిజర్వేషన్లకు చెల్లు

- ఐదేళ్లకోసారి రొటేషన్‌ ప్రాతిపదికన రిజర్వేషన్లు

- జిల్లాలో పెరగనున్న ఎంపీటీసీ స్థానాలు

- పంచాయతీరాజ్‌ చట్టానికి ప్రభుత్వం సవరణలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ముఖచిత్రం మారనున్నది. గత ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం-2018కి ప్రభుత్వం పలు సవరణలు చేసింది. దీంతో ఎన్నికల్లో రిజర్వేషన్లు మారనున్నాయి. పదేళ్లకోసారి ఒకే రిజర్వేషన్‌ విధానాన్ని ఐదేళ్లకు మారుస్తూ చట్ట సవరణ చేసింది. ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొనడంతో కొన్ని ఎంపీటీసీ స్థానాలు పెరగనున్నాయి. జిల్లాలో 267 గ్రామపంచాయతీలు, 2,484 వార్డులు ఉన్నాయి. పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం ఫిబ్రవరి 2వ తేదీతో ముగిసింది. అప్పటినుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. అలాగే జిల్లాలో 13 రూరల్‌ మండలాలు, ఒక అర్బన్‌ మండలం ఉంది. 13 మండలాలకు జిల్లా ప్రజా పరిషత్‌ సభ్యులు, 13 మండల పరిషత్‌లు ఉన్నాయి. మండల పరిషత్‌ల్లో మొత్తం 137 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ముఖచిత్రాన్ని మార్చివేసింది. 10 జిల్లాలను పునర్విభజించి 33 జిల్లాలుగా చేసింది. దీంతో రెవెన్యూ డివిజన్లతో పాటు, కొత్త మండలాలు కూడా ఏర్పడ్డాయి. 2019లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం పాత పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించి నూతన చట్టం-2018ని తీసుకవచ్చింది. అంతకుముందు ప్రతి ఐదేళ్లకోసారి ఉన్న రిజర్వేషన్‌ విధానాన్ని పదేళ్లకు పెంచింది. పదేళ్ల తర్వాత రొటేషన్‌ పద్ధతిన కొనసాగనున్నదని పేర్కొంది. అలాగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను పెంచి వాటిలో కొన్ని గ్రామాలను విలీనం చేసింది. అంతేగాకుండా 500 జనాభా కలిగిన గ్రామాలన్నింటినీ, గిరిజన తండాలు, గూడెంలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా జిల్లాలో 58 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో మరికొన్ని మండలాలతో పాటు పంచాయతీలు కూడా ఏర్పడ్డాయి. దీంతో పదేళ్ల రిజర్వేషన్‌ విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించడం కుదరదని భావించిన ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఐదేళ్లకోసారి రిజర్వేషన్‌ మారే విధానాన్ని తీసుకవచ్చింది. దీంతో జిల్లాలోగల గ్రామపంచాయతీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, మేయర్‌, కార్పొరేటర్ల రిజర్వేష్లన్నీ మారనున్నాయి. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల వారీగా నిర్ధేశించే రిజర్వేషన్ల శాతం ప్రకారం కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఫ ఆ పంచాయతీలకు జరగనున్న ఎన్నికలు..

గత ఐదేళ్లుగా ఎన్నికలకు నోచుకోని నాలుగు గ్రామపంచాయతీలు ఈసారి ఎన్నికలకు నోచుకోనున్నాయి. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికలకు ముందు అంతర్గాం మండలం కుందనపల్లి, లింగాపూర్‌, రామగిరి మండలం వెంకట్రావుపల్లి పంచాయతీలతో పాటు పాలకుర్తి మండలం ఎల్కలపల్లి పరిధిలోగల రెండు వార్డులను రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీనిని ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించినప్పటికీ విలీన ప్రక్రియ నిలువరించలేదు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మున్సిపల్‌ ఎన్నికలకు ముందు ఆ గ్రామాలకు విలీనం నుంచి అప్పటి ప్రభుత్వం విముక్తి కల్పించింది. కానీ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఎల్కలపల్లి పంచాయతీలోని రెండు వార్డులను 8 వార్డులుగా చేసి ఎల్కలపల్లి గేట్‌ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీల్లో ఐదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పదేళ్ల రిజర్వేషన్‌ విధానానికి చట్ట సవరణ చేయడంతో ఆ పంచాయతీలకు మార్గం సుగమం అయ్యింది. అలాగే జిల్లాలో కొత్తగా మరో రెండు గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. మంథని మండలం లక్కేపూర్‌ పంచాయతీ పరిధిలోగల తోటగోపయ్యపల్లి, ముత్తారం మండలం ఖమ్మంపల్లి పంచాయతీలో గల జిల్లెల్లపల్లి పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. వీటికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

ఫ పెరగనున్న ఎంపీటీసీ స్థానాలు..

జిల్లాలోని 13 రూరల్‌ మండలాల్లో 137 ఎంపీటీసీ స్థానాల సంఖ్య పెరగనున్నది. ప్రతి మండలంలో 5కు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండాలని చట్ట సవరణ చేశారు. గతంలో 3 నుంచి 4 వేల జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. అంతర్గాం మండలంలో 5, ధర్మారంలో 15, ఎలిగేడులో 6, జూలపల్లిలో 9, కమాన్‌పూర్‌లో 6, మంథనిలో 11, ముత్తారంలో 8, ఓదెలలో 12, పాలకుర్తిలో 11, పెద్దపల్లిలో 17, రామగిరిలో 12, కాల్వశ్రీరాంపూర్‌లో 12, సుల్తానాబాద్‌ మండలంలో 13 స్థానాలున్నాయి. ప్రతి మండలంలో ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండాలనే నిబంధన మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో 6కు తగ్గకుండా ఉన్నారు. ఒక్కో ఎంపీటీసీ స్థానం జనాబాను 250కి తగ్గించినట్లయితే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోగల జనాభా 4,87,823ను అనుసరించి ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్‌ చేసినట్లయితే మరో 60 స్థానాల వరకు పెరగవచ్చని అంచనా. ఒకవేళ డీలిమిటేషన్‌ చేయకుంటే మాత్రం అంతర్గాం, రామగిరి మండలాల్లో కుందనపల్లి, లింగాపూర్‌, వెంట్రావుపల్లి పంచాయతీలను పరిగణనలోకి తీసుకుంటే మూడు నుంచి నాలుగు స్థానాలు పెరగవచ్చు.

Updated Date - Dec 23 , 2024 | 02:05 AM