Share News

పూడికతీతతో పైసలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:12 AM

రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టుల్లో పూడికితీత పనుల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓ వైపు పూడికతీత

పూడికతీతతో పైసలు

ప్రాజెక్టుల పూడికతీతలో జాతీయ విధానం

కడెం రిజర్వాయర్‌లో ప్రయోగాత్మకంగా అమలు

మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులకు ఆమోదం.. ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టుల్లో పూడికితీత పనుల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓ వైపు పూడికతీత పనులు చేపట్టి ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడంతోపాటు పూడికతీతతో వచ్చిన ఇసుక, మట్టి విక్రయాలతో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం చేసిన సిఫారసులకు, పూడికతీత పనుల్లో జాతీయ పూడికతీత విధానం అమలుకు అమోదం తెలిపింది. తొలుత కడెం రిజర్వాయర్‌లో ప్రయోగాత్మకంగా ఈ విధానాలను అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల(జీవో నెం 316)ను నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా మంగళవారం జారీ చేశారు. పూడికతీతలో జాతీయ విధానాన్ని అమలు చేయడంపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం చేసిన ఆయా సిఫారసులను అక్టోబరు 26న మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే.

ఆదాయం ఇలా..

రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో తీసే పూడికలో ఇసుక ఉంటే వాణిజ్య అవసరాలకు విక్రయిస్తారు. బంకమట్టి ఉంటే రైతులకు ఉచితంగా ఇస్తారు. అయితే, మట్టిని తరలించుకునే బాధ్యత రైతులదే. ఇక, మట్టిని పెళ్లల రూపంలో తయారు చేసి ఇటుకల తయారీ పరిశ్రమలకు విక్రయిస్తారు. ఆయా విధానాలను కడెం రిజర్వాయర్‌ పూడికతీత పనుల్లో అమలు చేసి.. ఫలితాల అనంతరం ఇతర ప్రాజెక్టుల వద్ద ఈ పద్ధతిని పాటించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తెలంగాణ ఇంజనీరింగ్‌ పరిశోధన కేంద్రం(టీజీఈఆర్‌ఎల్‌) సహకారం తీసుకోనుంది. జలాశయంలో ఎంత పూడిక ఉంది ? ఇసుక, రాళ్లు, బంక మట్టి ఏమేరకు ఉన్నాయి ? వంటి వాటిపై టీజీఈఆర్‌ఎల్‌ అధ్యయనం చేసిన తర్వాత పూడికతీత ఆసక్తివ్యక్తీకరణ కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఏటా నవంబరు లేదా డిసెంబరు నుంచి మరుసటి ఏడాది జూన్‌ మధ్య పూడికతీత పనులు నిర్వహించనున్నారు.

సాగర్‌లో 100 టీఎంసీలకు పైగా నష్టం

ఏళ్లుగా పేరుకుపోయిన పూడిక రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేస్తోంది. ముఖ్యంగా 408 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూడిక వల్ల 108 టీఎంసీల మేర సామర్థ్యాన్ని కోల్పోయింది. 308 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ప్రాజెక్టు 93 టీఎంసీల సామర్థ్యాన్ని కోల్పోయింది. నారాయణపూర్‌ ప్రాజెక్టు 26.84 శాతం, మంజీరా 36.79 శాతం, నిజాంసాగర్‌ 55.14 శాతం. జూరాల 19.23 శాతం. తుంగభద్ర 23.87 శాతం, శ్రీరాంసాగర్‌ 28.49 శాతం మేర నీటి నిల్వ సామర్థ్యాలను కోల్పోయాయి.

Updated Date - Nov 20 , 2024 | 04:12 AM