The High Court : పుష్ప-2 టికెట్ ధరలపై స్టే ఇవ్వలేం
ABN , Publish Date - Dec 04 , 2024 | 05:51 AM
దేశవ్యాప్తంగా క్రేజ్ సంతరించుకున్న పుష్ప-2 టికెట్ ధరలను భారీగా పెంచడంపై తక్షణం స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వమే స్వయంగా అనుమతిస్తే తామేం
ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు మేమేం చేయగలం?.. అర్ధరాత్రి బెనిఫిట్ షోలతో పిల్లల పరిస్థితి ఏంటి?
ప్రభుత్వ భూములు తీసుకుని ఏం రాయితీలు ఇస్తున్నట్లు?
పది మందితో సినిమాకు వెళ్తే 8 వేల ఖర్చా? : హైకోర్టు
కౌంటర్ దాఖలుకు నిర్మాతకు ఆదేశం.. విచారణ 17కు వాయిదా
పుష్ప-2తో స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని మరో పిటిషన్
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా క్రేజ్ సంతరించుకున్న పుష్ప-2 టికెట్ ధరలను భారీగా పెంచడంపై తక్షణం స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వమే స్వయంగా అనుమతిస్తే తామేం చేయగలమని ప్రశ్నించింది. అయితే కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటే అవుతున్న ఖర్చుపై ఆందోళన వ్యక్తం చేసింది. పది మంది సినిమాకు వెళ్తే రూ.8 వేలు ఖర్చవుతోందని వ్యాఖ్యానించింది. అర్ధరాత్రి, తెల్లవారు జామున ప్రదర్శిస్తున్న బెనిఫిట్ షోలకు పిల్లలు వెళ్తే వారికి వచ్చే అనారోగ్యం పరిస్థితేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములు తీసుకుని నిర్మించిన థియేటర్లు, ఆస్పత్రులు రాయితీలు ఇస్తామని ఒప్పందాలు చేసుకుని వాటిని అమలు చేయడం లేదని వ్యాఖ్యానించింది. పుష్ప-2 సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంతోపాటు అర్ధరాత్రి ఒంటి గంటకు, తెల్లవారు జామున 4 గంటలకు ఆరు, ఏడు షోల ప్రదర్శనకు అనుతివ్వడం అక్రమమని, ప్రభుత్వానికి ఆ అధికారం లేదని పేర్కొంటూ చందానగర్‌కు చెందిన సతీశ్ కమాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పి.శ్రీనివా్‌సరెడ్డి వాదనలు వినిపిస్తూ.. టికెట్ రేట్లపై అదనంగా వసూళ్లకు అనుమతినివ్వడం అక్రమమని తెలిపారు. పెంచిన ఆదాయం దానధర్మాలకు ఇవ్వడం లేదని, నిర్మాత జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అర్ధరాత్రి, తెల్లవారు జామున అదనపు షోలు ప్రమాదకరమని పేర్కొన్నారు.
నిర్మాత నష్టపోకుండా ఉండాలనే..
మైత్రీ మూవీస్ తరఫున న్యాయవాది వాదిస్తూ చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అని, నిర్మాత నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కొద్దిరోజులపాటు ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని తెలిపారు. బెనిఫిట్ షోలు కేవలం అభిమానుల కోసం మాత్రమేనని చెప్పారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా మైత్రీ మూవీ్‌సకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా, పుష్ప-2 సినిమా ద్వారా స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని, సమాజానికి చెడు సందేశం ఇస్తున్న సినిమాను అడ్డుకోవాలంటూ సికింద్రాబాద్‌కు చెందిన సరారపు శ్రీశైలం అనే వ్యక్తి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య.. సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత సినిమాను అడ్డుకోవాలని కోరడం ద్వారా పిటిషనర్ కోర్టు టైం వృథా చేశారంటూ జరిమానా విధించారు. ఈ జరిమానా ఎంత అనేది తెలియజేస్తామని, దీనిని అక్రమ రవాణా బాధితులు, మహిళలు, పిల్లల కోసం ఖర్చు పెట్టాలని పేర్కొన్నారు. కేవలం టీజర్ చూసి ఊహించుకుని చివరి నిమిషంలో సినిమా అడ్డుకోవాలని పిటిషన్ వేయడం సమంజసం కాదని, సినిమాను అడ్డుకుంటే నిర్మాత, డైరెక్టర్ తీవ్రంగా నష్టపోతారని వ్యాఖ్యానించారు.