ఇంజనీరింగ్ ఫీజు బకాయి రూ.160కోట్లు
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:36 AM
ఇంజనీరింగ్ కళాశాల ఫీజు రీయింబర్స్‌మెంట్ టోకెన్లు ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా నిధుల విడుదలపై స్పష్టత రాకపోవడంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు మదనపడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 16 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు
ప్రభుత్వం టోకెన్లు ఇచ్చినా ఏడాదిగా ఎదురుచూపు
డీటీవో కార్యాలయాలకు డబ్బు జమకాక అయోమయం
కోదాడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కళాశాల ఫీజు రీయింబర్స్‌మెంట్ టోకెన్లు ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా నిధుల విడుదలపై స్పష్టత రాకపోవడంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు మదనపడుతున్నాయి. మూడు సంవత్సరాల నుంచి ఫీజు రీయిం బర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు బకాయిల విడుదలకు టోకెన్లు జారీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. సెప్టెంబరు నెల చివరి నాటికి బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, నేటికీ బకాయిలు విడుదల కాకపోవడంతో అధ్యాపకులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, భవనాల ఈఎంఐలు చెల్లించలేదని, విద్యుత్ బిల్లులు కట్టలేకపోతున్నామని వారు పేర్కొంటున్నారు. అటెండర్లకు కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని నిర్వాహకులు ఆందోళనలో ఉన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒక్కో కళాశాలకు మూడు సంవత్సరాల నుంచి రూ.10కోట్ల నుంచి రూ.20కోట్ల బకాయిలు ఉన్నట్లు పేర్కొం టున్నారు. వాటిలో ప్రతి కళాశాలకు రూ..5నుంచి రూ.10కోట్ల బకాయిలు విడుదల చేస్తే కొంతమేర ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు.
దినదిన గండం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. మూడేళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.160కోట్లు రావాల్సి ఉంది. వీటికి ఏంబీఏ, ఏంసీఏ, ఫార్మసీ, బీఎడ్, పీజీ బకాయిలు అదనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి టీబీఆర్‌లో బిల్‌లు రిజిస్టర్ అయ్యాయి. బిల్ అయినట్లు టోకెన్ల నెంబర్లు ఇచ్చారు. ప్రభుత్వం డీటీవో కార్యాలయాలకు డబ్బు చేయకపోవటంతో 10నెలల నుంచి టోకెన్లు పాస్ కావటంలేదు. ఫలితంగా డబ్బులు రావడం లేదని కళాశాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లా బంద్ బాట తప్పదా?
హైదరాబాద్‌లో ఉన్న కళాశాలల్లో సీట్ల సంఖ్య ఎక్కువ. వాటిలో 30శాతం మేనేజ్‌మెంట్ కోటా ఉంటుంది. ఫలితంగా కోటా కింద వచ్చే నిధులతో వారు కళాశాలలను నిర్వహించడం సులభం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాశాలలో మేనేజ్‌మెంట్ కింద చేరే విద్యార్థుల సంఖ్య తక్కువ. దీంతో ఆయా ప్రాంతాలలో నిర్వహిస్తున్న కళాశాలలు పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నడపాల్సి ఉం టుంది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోని కళాశాలు మేనేజ్‌మెంట్ కింద వచ్చే నిధులు నుంచి కొంత ప్రభుత్వానికి సహాయం రూపంలో అందిస్తాయి. వాటిని పరిగనలోకి తీసుకొని అన్ని కళాశాలలకు ఒకేలా నిధులు వస్తున్నాయని గ్రామీణ, పట్టణ ప్రాంత కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే కళాశాలలు ఎలా నడపాలని నిర్వహకులు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోకపోతే డిగ్రీ కళాశాల మాదిరి, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్‌బాట పట్టాల్సి వస్తోందని కళాశాల నిర్వహకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హమీ ప్రకారం బడ్జెట్ విడుదల చేసి, ఇచ్చిన టోకెన్లకు డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు.
టోకెన్లు ఇచ్చిన మేరకు బకాయిలు విడుదల చేయాలి
టోకెన్లు ఇచ్చిన మేరకు బకాయిలు విడుదల చేసి, అధ్యాపకులు వేతనాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చూడాలి. మూడు సంవత్సరాల నుంచి బకాయిలు ఇవ్వకపోతే కళాశాలల నిర్వహణ ఏవిధంగా చేయాలో ప్రభుత్వమే చెప్పాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవటంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలు విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలి.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకులు.