Share News

యాసంగి నాట్లకు.. వలస కూలీలు

ABN , Publish Date - Dec 23 , 2024 | 02:03 AM

యాసంగి నాట్ల జోరు మొదలైంది. కూలీల కొరతతో ఇబ్బందులుపడుతున్న అన్నదాతలకు వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు వ్యవసాయ పనులు వెతుక్కుంటూ వలస వచ్చిన కూలీలతో ఊరట లభిస్తోంది.

 యాసంగి నాట్లకు.. వలస కూలీలు
వరినాట్లు వేస్తున్న ఉత్తరప్రదేశ్‌ కూలీలు

- అన్నదాతలకు ఊరట

- ఇతర రాష్ట్రాల నుంచి రాక

- జిల్లాలో 1.77 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు

- వరి 1.74 లక్షల ఎకరాలు

- జిల్లాలో రోజు కూలి రూ.500 నుంచి 700 వరకు

- కూలీల కొరతతో ముందుగానే అడ్వాన్సులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

యాసంగి నాట్ల జోరు మొదలైంది. కూలీల కొరతతో ఇబ్బందులుపడుతున్న అన్నదాతలకు వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు వ్యవసాయ పనులు వెతుక్కుంటూ వలస వచ్చిన కూలీలతో ఊరట లభిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి వరి నాట్ల కోసం వలస వచ్చిన కూలీలు దాదాపు రెండు నెలలపాటు ఇక్కడే ఉండి వ్యవసాయ పనులు చేస్తూ ఉపాధి పొందుతారు. వ్యవసాయ కూలీలకు డిమాండ్‌ ఉండడంతో రైతులు ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లించి వరి నాట్లకు పిలుస్తున్నారు. ఇప్పటికే యాసంగి నాట్లు 30 నుంచి 40 శాతం వరకు కావాల్సి ఉండగా కూలీల కొరతతో మందకొడిగా సాగింది. వలస కూలీలు రావడంతో నాట్ల జోరు కనిపిస్తోంది. జిల్లాలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో ఈ సారి యాసంగికి సాగునీటి ఢోకా లేదని రైతులు ఉన్నారు. నాలుగేళ్లుగా వర్షాలు ఆశాజనకంగా పడడంతో జిల్లాలోని మిడ్‌ మానేరు, అన్నపూర్ణ, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లు, చెరువులు కుంటల్లో నీళ్లు చేరి భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. దీంతో రైతులు వరి సాగుపై మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో వరి సాగు పెరగడంతో రైతులు కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఆరు రాష్ట్రాల నుంచి జిల్లాకు వ్యవసాయ పనుల కోసం రావడంతో రైతులకు సాగు ఇబ్బందులు తొలగిపోతున్నాయి గడిచిన సీజన్‌లలో కూడా వలస కూలీలతోనే సాగు చేసుకున్న రైతులు ప్రస్థుత యాసంగి సాగు కూడా వలస కూలీలతోనే పనులు చేయించుకుంటున్నారు. నాలుగేళ్లుగా రెండు పంటల్లోనూ రైతులకు పొరుగు రాష్ట్రాల కూలీలే ఆధారమవుతున్నారు.

జిల్లాలో 1.74 లక్షల ఎకరాల్లో వరిసాగు

జిల్లాలో యాసంగిలో 1.77 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు సన్నద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా 1.74 లక్షల ఎకరాల్లో వరి వేస్తున్నారు. వరితో పాటు మొక్కజొన్న 1431 ఎకరాలు, నువ్వులు 362, పొద్దు తిరుగుడు 810, శెనగలు 178, ఇతర పంటలు 317 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పంటల సాగు కోసం 18500 క్వింటాళ్ల వరి విత్తనాలు, మొక్కజొన్న సాగుకు 115 క్వింటాళ్లు, నువ్వుల సాగుకు 6 క్వింటాళ్లు వేరుశెనగ సాగుకు 18 క్వింటాళ్ల విత్తనాలు వినియోగిస్తున్నారు. యాసంగిలో ఎరువులకు సంబంధించి యూరియా 21,811 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3359 మెట్రిక్‌ టన్నులు, ఎంపీకేఏస్‌ 11,516 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4607 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎప్‌పీ 1440 మెట్రిక్‌ టన్నుల ఎరువులను వ్యవసాయ శాఖ సమకూరుస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు

రెండేళ్లుగా వానాకాలం, యాసంగి సీజన్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధిని వెతుక్కుంటూ కూలీలు వలస వస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి, వేములవాడ ప్రాంతాల్లో వలస కూలీలు వరినాట్లు వేస్తున్నారు. ఇక్కడి మధ్యవర్తులు కొందరు బీహర్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు ఎకరానికి రూ.5500 నుంచి రూ.6500 వరకు వలస కూలీలకు చెల్లిస్తున్నారు. స్థానికంగా ఉండే కూలీలకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. గతంలో రూ.300 నుంచి రూ.400 వరకు ఉండే కూలి ప్రస్తుతం రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లిస్తున్నారు. మగ కూలీలకు రూ.700 నుంచి రూ.800 వరకు ఇస్తున్నారు. దీంతోపాటు సిరిసిల్ల జిల్లాకు సరిహద్దులో ఉన్న సిద్ధిపేట, కరీంనగర్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల నుంచి పొరుగు గ్రామాలకు వరినాట్లకు వచ్చే కూలీలకు రవాణా ఛార్జీలు అదనంగా చెల్లిస్తున్నారు. రైతులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలతో నాట్లలో వేగం పెరిగిందని చెప్పుకుంటున్నారు.

సమృద్ధిగా సాగునీరు

జిల్లాలో యాసంగికి సమృద్ధిగా సాగునీరు ఉండడంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌, ఎగువ మానేరు, నిమ్మపల్లి ప్రాజెక్ట్‌లతోపాటు చెరువులు జల కళను సంతరించుకున్నాయి. వరికి నీటి వసతి ప్రధానం కావడంతో చెరువులు, కుంటలతోపాటు బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 832.0 సాధారణ వర్షాపాతానికి 1009.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రంగిలో 961.5 మిల్లీమీటర్లు, చందుర్తి 1279.4, వేములవాడ రూరల్‌ 894.2, బోయినపల్లి 955.8, వేములవాడ 1022.7, సిరిసిల్ల 981.6, కోనరావుపేట 922.9, వీర్నపల్లి 1199.2, ఎల్లారెడ్డిపేట 1017.7, గంభీరావుపేట 872.8, ముస్తాబాద్‌ 1021.2, తంగళ్లపల్లి 1024.2, ఇల్లంతకుంటలో 967.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 26.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో యాసంగికి ఇబ్బంది ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 02:03 AM