Share News

సీలింగ్‌ ఫ్యాన్లకు యాంటీ సూసైడ్‌ రాడ్‌ !

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:28 AM

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమవుతోందన్న విమర్శలున్నాయి. రెండేళ్లలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

సీలింగ్‌ ఫ్యాన్లకు యాంటీ సూసైడ్‌ రాడ్‌ !

  • విద్యార్థి ఉరికి యత్నిస్తే స్ప్రింగ్ సాగి నేలకు

  • బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాదాలను ఇలా అరికట్చొచ్చు

  • రెండేళ్లలో 9 ఆత్మహత్యలు.. 8 ఫ్యాన్‌కు ఉరేసుకున్నవే

బాసర, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమవుతోందన్న విమర్శలున్నాయి. రెండేళ్లలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల స్వాతిప్రియ బలవన్మరణానికి పాల్పడింది. తొమ్మిది మందిలో 8 మంది సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నా రు. అయితే ‘యాంటీ సూసైడ్‌ ఫ్యాన్‌ రాడ్‌’లను బిగించడం ద్వారా ఫ్యాన్‌కు ఉరివేసుకొనే ఘటనలను నివారించవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీలింగ్‌ ఫ్యాన్‌కు పై భాగంలో ఈ స్ర్పింగ్‌ రాడ్‌ను అమరుస్తారు. ఇది 20 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వస్తువును భరించదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ బరువును వేలాడదీస్తే ఆ స్ర్పింగు విస్తరిస్తుంది. అంటే.. ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే వారు నెలకు తాకి ఆగిపోతారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని విద్యాకేంద్రమైన రాజస్థాన్‌ కోటాలోని ప్రతి కళాశాల, హాస్టల్‌లో అధికారులు అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని ట్రిపుల్‌ ఐటీ అధికారులు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్‌ ఐటీలోని హాస్టల్‌, తరగతి గదుల్లో 1500 ఫ్యాన్‌ల వరకు ఉంటాయి. ఒక్కోదానికి 200 ఖర్చు అయినా రూ. 5 లక్షల్లో యూనివర్సిటీలోని అన్ని ఫ్యాన్‌లకు యాంటీ సూసైడ్‌ ఫ్యాన్‌ రాడ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.

Updated Date - Nov 13 , 2024 | 04:28 AM