గిరిజనుల అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:25 AM
గిరిజన వర్గాన్ని విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక పరంగా అభివృద్ధి చేయడం అందరి బాధ్యత అని.. వారి కళలు, సంప్రదాయాన్ని ప్రోత్సహించడం
రేపటి నుంచి హైదరాబాద్‌లో లోక్ మంథన్
సంస్కృతి ఉట్టిపడేలా అంతర్జాతీయ సదస్సు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గిరిజన వర్గాన్ని విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక పరంగా అభివృద్ధి చేయడం అందరి బాధ్యత అని.. వారి కళలు, సంప్రదాయాన్ని ప్రోత్సహించడం దిశగా లోకమంథన్ నిరంతరం పనిచేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా హైదరాబాద్‌లో లోక్‌మంథన్-2024 పేరుతో అంతర్జాతీయ సదస్సు, సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. శిల్ప కళా వేదికగా ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే ఎగ్జిబిషన్, కల్చరల్ ఫెస్టివల్‌ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. 22న వివిధ దేశాల ప్రతినిధులతో మేధోమథనం కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి పలు రంగాల ప్రతినిధులు లోక్‌మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. దేశ నిర్మాణంలో సమాజం పాత్ర, ఆత్మనిర్భరత సాధించేందుకు చేయాల్సిన కృషి తదితర అంశాలపై ఇందులో చర్చ జరుగుతుందని తెలిపారు.
మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు..
రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. మతపరమైన రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిధిలోనిది అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో రిజర్వేషన్లను అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను కిషన్‌రెడ్డి స్వాగతించారు. మందిరంలో హిందువులు మాత్రమే పనిచేయాలనే నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 1 నుంచి 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ 1న చార్జ్‌షీట్ విడుదల చేయనుంది.